జాతి గౌరవాన్ని కిందపడకుండా కాపాడిన ధోనీ

క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన విచిత్రమైన ఘటనతో జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్షకుల మనస్సులను మరోసారి గెలుచుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని చేతిలో జాతీయజెండా పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. 

సరాసరి మహీ కాళ్ల మీదపడిపోయాడు. అయితే కాళ్లకు నమస్కరించే సమయంలో అతని చేతిలో జెండా నేలమీద పడబోతుండటంతో ధోనీ దానిని వెంటనే అందుకుని పైకి లేపాడు. ఇవేమీ పట్టించుకోని అభిమాని మాత్రం ధోనీని కలుసుకున్న ఆనందంలో మైదానంలో పరుగులు పెట్టుకుంటూ వెళ్లిపోయాడు. 

అయితే ధోనీ చేసిన పని ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో క్షణాల్లో నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపించారు. నిర్ణయాత్మక టీ20లో భారత్ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కివీస్ 213 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించడంతో భారత్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. 

హెల్మెట్‌పై భారత జెండా ఉంచుకోకపోవడానికి కారణం:
తలెత్తి సెల్యూట్ చేయాల్సిన జెండాను ధోనీ తలపై కూడా ఉంచుకోడు. ఒకవేళ అలా ఉంచుకున్నా అది నేరమంట. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971లో పేర్కొన్నట్లు ధోని క్రికెట్‌ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే. 

కీపింగ్‌ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్‌ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్‌పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. ఈ కారణంగానే ధోని హెల్మెట్‌పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్‌పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్‌గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే.