ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020నాటికి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డను వీడనుంది. బేస్ ప్లేస్ ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయటకు అస్సాం రాష్ట్రానికి తరలించనుంది. అస్సాంలోని గౌహతి సొంతమైదానంలా పరిగణించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియాన్ని వచ్చే సీజన్ కు సొంత మైదానంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
దీంతో మూడు మ్యాచ్ లు అస్సాంలోని గౌహతిలో ఆడుతుండగా, మిగిలిన నాలుగు మ్యాచ్ లను జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఆడనున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలియజేసింది. ఇంకా అస్సాం క్రికెట్ అసోసియేషన్ తో మాట్లాడి నామమాత్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ముందుగా ఈ విషయంపై బీసీసీఐని రిక్వెస్ట్ చేయగా ఆగష్టు 13న సీఓఏ దీనికి ఆమోదం తెలిపింది. అస్సాం క్రికెట్ ను ప్రోత్సహించే దిశగా రాజస్థాన్ యాజమాన్యం అస్సాంలోనూ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అక్కడ స్టేడియంలలోనూ క్రికెట్ ఆడితే ఆ ప్రాంతంలోనూ ఆదరణ పెరుగుతుందని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఉద్దేశ్యం.