ఐపీఎల్ వేలం ముగిసింది.. అయినా ఇంకా ఛాన్స్ ఉంది.. ఎలాగంటే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం ముగిసినప్పటికీ ఆటగాళ్లను తీసుకునేందుకు 10 ఫ్రాంచైజీలకు ఇంకా అవకాశం ఉంది.

IPL 2024 auction over but teams can still Add players to squad details here
IPL 2024 auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం మంగళవారం దుబాయ్‌లో ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు రూ. 230.45 కోట్లు వెచ్చించి మొత్తం 72 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ అత్యధిక ధర పలికారు. ఏకంగా రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన కొనుగోలుగా ఇది రికార్డుకెక్కింది. పాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు దక్కించుకుంది. పలువురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు వెచ్చించాయి.
తాజా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడం, పలు ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 10 ఫ్రాంచైజీలు తమ ర్యాంక్‌లను గణనీయంగా మెరుగుపరుచుకున్నాయి. అయితే ఇంకా తమ జట్టులోకి ప్లేయర్లను తీసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ట్రేడ్ విండో ద్వారా తమ జట్టులో ఆటగాళ్లను చేర్చుకోవచ్చు. స్వాప్ డీల్స్ లేదా ఆల్-నగదు ఒప్పందాలతో ప్లేయర్స్ ను కొనుగోలు చేయవచ్చు. వేలం ముగిసిన తర్వాత రోజు (డిసెంబర్ 20న) – ట్రేడ్ విండో ఓపెనయింది. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందు వరకు ఈ విండో తెరిచివుంటుంది. తమ జట్టులో ఇంకా ఆటగాళ్లను చేర్చుకోవాలనే ఫ్రాంచైజీలు ట్రేడ్ విండోను ఉపయోగించుకుని ఒప్పందాలు చేసుకోవచ్చు.
కాగా, ట్రేడ్ విండో డీల్‌తోనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగివచ్చాడు. ట్రేడ్ విండో తెరిచివున్న సమయంలో ప్రతి జట్టు చేసే ట్రేడ్‌ల సంఖ్యకు పరిమితి లేనప్పటికీ, అన్ని ఒప్పందాలకు IPL పాలక మండలి ఆమోదం తప్పనిసరి. ట్రేడ్ విండో ముగిసేలోపు ఫ్రాంచైజీలు తమ జట్లలో ఇంకెన్ని మార్పులు చేస్తాయో చూడాలి. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.