IPL 2024 Mock Auction : మిచెల్ స్టార్క్‌కు 18.5 కోట్లు, కొయెట్జీకి 18 కోట్లు.. మాక్ వేలంలో విదేశీ ఆటగాళ్లకు భారీ డిమాండ్
రేపు జరగనున్న వేలానికి ముందు ఈ రోజు సోమవారం డిసెంబర్ 18న డమ్మీ వేలాన్ని నిర్వహించారు.

IPL 2024 Mock Auction
IPL 2024 Mock Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌కు సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 19) న మినీ వేలం జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు చెందిన వేలంలో పాల్గొనే అధికారులంతా దుబాయ్ చేరుకున్నారు. రేపు జరగనున్న వేలానికి ముందు ఈ రోజు సోమవారం డిసెంబర్ 18న డమ్మీ వేలాన్ని నిర్వహించారు.
ఈ మాక్ ఆక్షన్‌లో పలువురు స్టార్ ప్లేయర్ల కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఎగబడ్డాయి. చివరకు రూ.18.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని దక్కించుకుంది. కాగా.. ఈ రోజు జరిగిన మాక్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఇతడే. ఆ తరువాత దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కొయెట్జీ రూ.18 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను దక్కించుకునేందుకు పలు ప్రాంఛైజీలు ఆసక్తి చూపించాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. పేసర్ శార్దూల్ ఠాకూర్ రూ.14 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. వీరితో పాటు శ్రీలంక ఆటగాళ్లు వానిందు హసరంగ, మధుషంక, ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌లను దక్కించుకునేందుకు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి.
మాక్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు..
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- రూ.18.5 కోట్లు (ఆర్‌సీబీ)
గెరాల్డ్ కొయెట్జీ (దక్షిణాఫ్రికా) – రూ.18 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- రూ.17.5 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
శార్దూల్ ఠాకూర్ (భారత్)- రూ.14 కోట్లు (పంజాబ్ కింగ్స్)
దిల్షన్ మధుషంక (శ్రీలంక)- రూ.10.5 కోట్లు (కేకేఆర్)
వనిందు హసరంగ (శ్రీలంక) – రూ.8.5 కోట్లు (సీఎస్‌కే)
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- రూ.7 కోట్లు (సీఎస్‌కే)
JioCinema mock auction:
Gerald Coetzee – 18cr.
Pat Cummins – 17.5cr.
Shardul Thakur – 14cr. pic.twitter.com/CKklXYRlSl— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2023
ఇది నిజమైన వేలం కానప్పటికీ పైన పేర్కొన్న ప్లేయర్లను దక్కించుకునేందుకు మాత్రం రేపు ప్రాంఛైజీలు పోటీ పడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఇందులో భారత ఆటగాళ్లు 214 మంది కాగా, విదేశీ ఆటగాళ్లు 119 మంది ఉన్నారు.