SRH Vs KKR: సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ ఫైనల్‌పై ఉత్కంఠ.. ఆటంటే ఇలా ఉండాలనేలా..

IPL 2024 Final: నిజానికి వేలంలో భారీగా ఖర్చుపెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసినా.... సన్ రైజర్స్ ఈ స్థాయిలో..

SRH Vs KKR: సన్‌రైజర్స్‌, నైట్‌రైడర్స్‌ ఫైనల్‌పై ఉత్కంఠ.. ఆటంటే ఇలా ఉండాలనేలా..

PIC Credit: @SunRisers Twitter

ఐపీఎల్ 17వ సీజన్ కప్పెవరిది…? ఇంకెవరిది మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే అని ఆ జట్టు అభిమానులు ఛాలెంజ్‌ చేస్తున్నారు.. ఈ సీజన్‌లో ధనాధన్‌ బ్యాటింగ్‌తో శివాలెత్తిన సన్‌రైజర్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డులతో టైటిల్‌ ఫేవరేట్‌ నిలిచింది.. ఐపీఎల్‌ చరిత్రలోనే మూడు అత్యధిక స్కోర్లను ఈ సీజన్‌లోనే నమోదు చేశారు సన్‌ రైజర్స్‌ ఆటగాళ్లు.

అలాగే ఐదు ఓవర్లలో వందకుపైగా పరుగులు చేసి సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా, ఉత్సాహంగా సన్‌రైజర్స్ కనిపిస్తోంది. క్వాలిఫయ్యర్ 2లోనూ చేజారిందనుకున్న మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్లో ప్రవేశించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ రికార్డులు, రాజస్థాన్ రాయల్స్‌పై ఆడిన విధానమూ చూసిన వారికి 2024 ఐపీఎల్ కప్ SRHదే అన్న నమ్మకం కలుగుతోంది.

రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్‌లో రికార్డులు బద్దలు చేస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది SRH. హైదరాబాద్‌లో జరిగిన క్వాలిఫయర్ 1లో మాత్రం కోల్‌కతా చేతిలో ఓటమి పాలయింది. హైదరాబాద్‌పై కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండడం, మెరుగైన రన్‌రేట్ ఉండడంతో క్వాలిఫయర్ 2లో ఆడే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టలేదు.

చెన్నై చెపాక్ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో మాత్రం 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండే రాజస్థాన్ రాయల్స్ చెపాక్ స్టేడియంలో 175 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా చేధిస్తుందని అంతా అంచనావేశారు. అయితే స్పిన్నర్లు మ్యాచ్‌ను హైదరాబాద్ పరం చేశారు.

ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్‌ శర్మ రెండ వికెట్లు తీయడంతో రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో సరిపెట్టుకుని ఇంటిముఖం పట్టింది. ఇదే ఊపుతో చెపాక్ స్టేడియంలో మరోసారి రాణించి, కోల్‌కతాపై విధ్వంస బ్యాటింగ్ కొనసాగించి ఈ ఐపీఎల్ విజేతగా హైదరాబాద్ నిలుస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

ఫైనల్‌ చేరే క్రమంలో 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింటిలో గెలిచి ఆరింటిలో ఓడిపోయింది సన్‌రైజర్స్. గతంలోనూ సన్ రైజర్స్ మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. 2016 సీజన్‌లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మీద ఫైనల్‌లో గెలిచి కప్పు కైవసం చేసుకుంది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఫైనల్లో ఓడిపోయింది.

ఇప్పుడు మరోసారి ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే 2018 తర్వాత జట్టు ఆటతీరు దిగజారింది. మూడేళ్లగా జట్టును వరుస వైఫల్యాలు వెంటాడాయి. గత ఏడాది అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగున ననిలిచింది. అలాంటి జట్టు యజమాని కావ్యమారన్ వ్యూహాలతో ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుని టైటిల్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో కావ్యపై ప్రశంసలు కురుస్తున్నాయి. సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరడంపై ఆమె సంతోషపడిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కావ్య హావభావాలు ప్రతిసారి వైరల్
గెలిచినప్పుడే కాదు…గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయినప్పుడల్లా ఆ జట్టుకన్నా కావ్య మారన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. చివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో… దీనిపై మాట్లాడారు.

సన్‌రైజర్స్ ఓడిపోయినప్పుడు కావ్య హావభావాలు చూడలేకపోతున్నానని.. జట్టులోకి మంచి ఆటగాళ్లను తీసుకోవాలని ఆమె తండ్రి కళానిధిమారన్‌కు సూచించారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ విధ్వంస బ్యాటింగ్ చూసినప్పుడల్లా అందరికీ రజనీకాంత్ మాటలు గుర్తొచ్చాయి. 2024లో సరికొత్త రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ను చూసి కావ్యమారన్ చేసుకున్న సంబరాలు సీజన్‌కే హైలెట్‌గా నిలిచాయి.

సీజన్‌కు ముందు, తర్వాత అనేలా..
అసలు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఈ సీజన్‌కు ముందు, తర్వాత అన్నట్టుగా చూడాలి. 2016లో కప్ గెలిచినా, 2018లో ఫైనల్‌కు చేరినా..జట్టు ఇప్పుడున్నంత బలంగా గతంలో కనిపించలేదు. గత ఏడాది వేలంలో కావ్యమారన్ ఆచితూచి వ్యవహరించారు. గతంలోలా సత్తా లేని ఆటగాళ్లపై కాకుండా ఈ సారి కోట్లు ఖర్చు పెట్టి మెరుగైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అలా సన్‌రైజర్స్ కథ మార్చివేశారు. వేలానికి ముందు వరకూ సన్‌రైజర్స్‌పై పెద్దగా అంచనాలు లేవు.

ICC వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో అంతా భారత్ టైటిల్ ఫేవరెట్ అనుకోగా…కెప్టెన్‌గా అనూహ్య నిర్ణయాలతో ఆస్ట్రేలియా కప్‌ను ముద్దాడేలా చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు వేలంలో కావ్య కాసులు కురిపించారు. 20కోట్ల ఐదు లక్షలు పెట్టి సన్‌రైజర్స్ కమిన్స్‌ను కొనుగోలు చేసింది. మరో కీలక ఆటగాడు, వరల్డ్ కప్‌ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ట్రావిస్ హెడ్‌ను 6కోట్ల80లక్షలకు కొనుగోలు చేసింది. అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటివారు రాణించడంతో హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

నిజానికి వేలంలో భారీగా ఖర్చుపెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసినా….సన్ రైజర్స్ ఈ స్థాయిలో ఆడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. 2023 సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఎందుకంటే గత ఏడాది జట్టులో ఉన్న హ్యారీ బ్రూక్‌ కోసం 13 కోట్ల 25లక్షలు ఖర్చుపెట్టింది హైదరాబాద్. కానీ అతను పెద్దగా రాణించలేకపోయాడు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకుని హైదరాబాద్ దారుణ మూల్యం చెల్లించుకుందన్న విమర్శలూ వచ్చాయి.

కానీ ఈ సారి మాత్రం ఆరంభం నుంచే సన్‌రైజర్స్ అదరగొట్టింది. భారీ అంచనాల్లేకుండా సీజన్ ప్రారంభించిన హైదరాబాద్ ఎవరూ ఊహించని ఫలితాలు రాబట్టింది. భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ వెటరన్ స్పిన్నర్ డానియల్ వెటోరిని కోచ్‌గా నియమించుకుంది. ఫలితంగా తన రికార్డులు తానే బద్ధలు కొట్టింది సన్‌రైజర్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లోనూ కమిన్స్, వెటోరి కలిసి తీసుకున్న అనూహ్య నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని శాసించాయి.

క్వాలిఫయర్ 2 మ్యాచ్ ముందు వరకు సన్ రైజర్స్ స్పిన్నర్లు తీసింది 14 వికెట్లే. కానీ ఫైనల్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో స్పిన్నర్లు ఐదువికెట్లు తీశారు. షాబాజ్, అభిషేక్ శర్మ బౌలింగే మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఇప్పటిదాకా పేస్ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడిన సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ రాజస్థాన్ రాయల్స్‌లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టుపై మాత్రం స్పిన్లర్లతో ఒత్తిడి తెచ్చి ఫలితాలు రాబట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవాలన్న కోచ్ వెటోరి నిర్ణయం హైదరాబాద్ విజయాన్ని ఖరారుచేసింది.

సీజన్‌ మొత్తం హైదరాబాద్ మెరుగైన ఆటను ప్రదర్శించిందనే చెప్పాలి. కొన్ని మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు బ్యాటుతో విధ్వంసం సృష్టించారు. ఆడిన ప్రతి బాల్ బౌండరీకే పోతుందా అన్న తరహాలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగి మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్ల బ్యాటింగ్ ధాటికి బౌండరీ లైన్ బయట బంతిని పట్టుకునే బాల్ బాయ్స్‌ కూడా హెల్మెట్ పట్టుకున్నారు.

హెడ్, అభిషేక్ శర్మ కలిసి పవర్‌ ప్లేలో ఓవర్‌కు 20 పరుగులు చొప్పున రాబట్టారు. ఐదు ఓవర్లలో వందకు పైగా పరుగులు, ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో హాఫ్‌ సెంచరీ,125 పరుగులతో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు వంటి ఎన్నో రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. అంతకుముందు ఒక మ్యాచ్‌లో 287, మరో మ్యాచ్‌లో 277 పరుగులు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సీజన్‌ కంటే ముందు హైదరాబాద్ అత్యధిక స్కోరు 263కాగా ఐపీఎల్ చరిత్రలో నాలుగు అత్యధిక స్కోర్లలలో మూడింటిని సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనే చేసింది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేయగా, హైదరాబాద్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులతో తన రికార్డును తానే అధిగమించింది. ఇలా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జోరు మీద ఉంది. అయితే సీజన్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ…ఫైనల్‌లో కోల్‌కతాపై గెలిచే అవకాశాలు సన్‌రైజర్స్‌కే మెండుగా ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. గతంలో 2009లో హైదరాబాద్ పూర్వ జట్టు డెక్కన్ చార్జర్స్ కప్పు గెలిచింది. అంతకుముందు ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానంలో ఉంది. అదే సంప్రదాయం సన్‌రైజర్స్‌ కొనసాగిస్తుందంటున్నారు తెలుగువారు.

Also Read: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం