IPL 2025 : గుడ్ న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ మళ్లీ ప్రారంభం కాబోతుంది. కొత్త షెడ్యూల్ అతి త్వరలో విడుదల కానుంది.

IPL 2025 : ఐపీఎల్ టోర్నీ మళ్లీ మొదలుకాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎడిషన్ గురువారం (మే 15) లేదా శుక్రవారం (మే 16) తిరిగి ప్రారంభం కానుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. “భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మిగిలిన మ్యాచ్‌లను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ధర్మశాల మ్యాచ్ తప్ప, ఇతర మ్యాచ్‌లు దేశ వ్యాప్తంగా జరుగుతాయని విశ్వసనీయ సమాచారం.”
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మే 9న శుక్రవారం బీసీసీఐ ఐపీఎల్ టోర్నీని ఒక వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, శనివారం సాయంత్రం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
శుక్ర, శనివారాల్లో భారత్ విడిచి వెళ్ళిన విదేశీ ఆటగాళ్లలో ఎక్కువ మందిని వీలైనంత త్వరగా తమ జట్లలో చేరమని కోరనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 2025 ఐపీఎల్ ఎడిషన్‌లో 60 మందికి పైగా విదేశీ ఆటగాళ్ళు 10 జట్ల తరపున ఆడుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 57 మ్యాచ్‌లు జరిగాయి, మిగిలిన మ్యాచ్‌లు త్వరలోనే పూర్తి కానున్నాయి.
త్వరలో కొత్త షెడ్యూల్ విడుదల :
రాబోయే రోజుల్లో బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మే 8న గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 58వ లీగ్ మ్యాచ్ 10.1 ఓవర్ల ఆట తర్వాత బ్లాక్అవుట్ కారణంగా ఆగిపోయింది. నివేదికల ప్రకారం.. వచ్చే వారం టోర్నమెంట్ తిరిగి ప్రారంభమైతే.. పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ మళ్లీ జరుగనుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ముందు ఐపీఎల్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. “భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కొనసాగుతున్న TATA IPL 2025 మిగిలిన మ్యాచ్‌లను ఒక వారం పాటు నిలిపివేయాలని నిర్ణయించింది.
సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదించి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత టోర్నమెంట్ కొత్త షెడ్యూల్, వేదికలకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తాం” అని పేర్కొంది.
“చాలా మంది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళన, మనోభావాలు, బ్రాడ్ క్యాస్టర్లు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలతో పాటు అన్ని కీలక వాటాదారులతో సంప్రదింపుల అనంతరం ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది.