IPL 2025 starts on March 22 first match between KKR and RCB
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 శనివారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు వారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 18 సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గురువారం ఆర్‌సీబీ తమ కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సైతం తమ హోం గ్రౌండ్‌లోనే తొలి మ్యాచ్‌ను ఆడనున్నట్లు పేర్కొంది. మార్చి 23న ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరగనున్నట్లు వివరించింది.
కాగా.. ఐపీఎల్ షెడ్యూల్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బీసీసీఐ ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు ముఖ్యమైన మ్యాచ్‌లకు సంబంధించిన తేదీల విషయాన్ని బోర్డు తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న కేకేఆర్ హోంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో మే 25 జరగనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.
WPL 2025 : నేటి నుంచే డబ్ల్యూపీఎల్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫయర్ 2, గ్రాండ్ ఫైనల్ కోల్‌కతాలో జరుగుతాయి.
ఐపీఎల్ ప్రారంభ తేదీ సవరణ..
జనవరి 12న ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం తర్వాత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఐపీఎల్ 2025 మార్చి 23న ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌ను ఒక రోజు ముందు నిర్వహించాలని ప్రసారకులు అభ్యర్థించారు. దీంతో ఒక రోజు ముందుకు జరిపినట్లుగా నివేదిక పేర్కొంది. ఇక ఐపీఎల్ పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకటి లేదా రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రూ.639.15 కోట్ల ఖర్చు..
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలాన్ని నిర్వహించారు. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను తీసుకున్నాయి. ఈ క్రమంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో 182 మంది ఆటగాళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లను ఖర్చు చేశాయి.
లక్నో జట్టు రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్, వెంకటేశ్ అయ్యర్ ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సొంతం చేసుకున్నాయి.