IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్.. ఐపీఎల్-2025 నిరవధిక వాయిదా.. ప్రకటించిన బీసీసీఐ

IPL 2025

Updated On : May 9, 2025 / 1:05 PM IST

IPL 2025: భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా సమస్యల కారణంగా అర్ధంతరంగా రద్దు చేయబడిన విషయం తెలిసిందే. తాజాగా.. సమావేశమైన బీసీసీఐ.. క్రికెట్ ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చుననే అనుమానంతో ఐపీఎల్ ను నిరవదిక వాయిదా వేసింది.

“ఐపీఎల్ వాయిదా వేయబడుతుంది. కేంద్రం, అన్ని ఫ్రాంచైజీలు, వాటాదారులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈరోజు నుండి ఎటువంటి మ్యాచ్ ఉండదు” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

 

టోర్నీని వాయిదా వేసినప్పటికీ.. ఎప్పుడు పునఃప్రారంభిస్తారనేది బీసీసీఐ అధికారులు వెల్లడించలేదు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో టోర్నీని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఇంగ్లాండ్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ తరువాత ఐపీఎల్ టోర్నీని పున:నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం వరకు IPL 2025 లో 57 మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. మే 8న (గురువారం) ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (PBKS vs DC) భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో ఆగిపోయింది. ఐపీఎల్ -2025 సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్ లు ఉడాల్సి ఉంది. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే25న కోల్ కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 16పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.