IPL 2026 : ఐపీఎల్ నుంచి CSK ఔట్.. SRH మా కొంపముంచింది.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక కామెంట్స్.. ధోనీ గురించి మాట్లాడుతూ..
IPL 2026 : ఐపీఎల్ -2026 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కథ ముగిసింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది.
Ruturaj Gaikwad
- ఐపీఎల్ 2026 నుంచి సీఎస్కే ఔట్
- గుజరాత్ టైటాన్స్‌పై భారీ పరుగుల తేడాతో ఓటమి
- సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక కామెంట్స్
IPL 2026 : ఐపీఎల్ -2026 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కథ ముగిసింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది. బ్యాటుతో, బంతితో సీఎస్కే తేలిపోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆది నుంచి ఆధిపత్యం సాధించి 89 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విఫలమైంది. 13.4 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ -2026 టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లయింది. ఈ టోర్నీలో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు.. కేవలం ఆరు మ్యాచ్ లను మాత్రమే గెలుచుకొని 12 పాయింట్లతో నిలిచింది. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ కంటే గుజరాత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. లక్ష్యం ఎంతున్నా సరే.. దానిని వీలైనంత త్వరగా ఛేదించాలని మేము భావించాం. అయితే, 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువుకాదు. మరీ ముఖ్యంగా బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుపై గెలవడం చాలా కష్టం. అయిన సరే, ఎందుకు ప్రయత్నించకూడదు..? మన ఆటను స్వేచ్ఛగా ఎందుకు ఆడకూడదు..? అని భావించాం. కానీ, లక్ష్య ఛేదనలో విఫలం అయ్యాం. మ్యాచ్ ప్రారంభంలో వికెట్ కొద్దిగా స్పాంజీగా ఉంది. కానీ, వారు చాలా అద్భుతంగా ఆడారు. మా బౌలింగ్ పవర్ ప్లేలో అస్సులు బాగాలేదు. వారి ఓపెనర్లను అడ్డుకోలేకపోయాం. వారిని 200 పరుగుల లోపే కట్టడిచేసే అవకాశం మాకు వచ్చింది. కానీ, మేము సద్వినియోగం చేసుకోలేక పోయాం.
టోర్నీ నుంచి నిష్ర్కమించడంపై మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 10 ఓవర్లలో 80 పరుగులు ఛేదించలేకపోయాం.. అలాగే చెన్నైలో వారిని తక్కువ పరుగులకే నియంత్రించలేకపోయాం. ఈ రెండు మ్యాచ్‌లు గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రహానే, నాయుడు వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు వెళ్లిపోయాక వారిలోటును భర్తీ చేయలేకపోయాం. ధోనీ భవిష్యత్తు ఏంటనేది మీకు, నాకు వచ్చే ఏడాది తెలుస్తుంది. అతని లోటు మాకు చాలా పెద్దది. అతను కేవలం క్రీజులో నిలబడితేనే చివరి ఓవర్లలో వచ్చి మ్యాచ్ ను పూర్తిగా మార్చేయగలడు. వచ్చే సీజన్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం అంటూ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.
