Rishabh Pant : ఐపీఎల్లో ముగిసిన లక్నో ప్రయాణం.. ప్రామిస్ చేసిన రిషబ్ పంత్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా..
ఇది తమకు కఠినమైన సీజన్ అని రిషబ్ పంత్ (Rishabh Pant) తెలిపాడు.
IPL 2026 LSG vs PBKS we promise to come back stronger next year Rishabh Pant (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్లో ముగిసిన లక్నో ప్రయాణం
- ఆఖరి స్థానంతో సీజన్ ముగింపు
- కీలక వ్యాఖ్యలు చేసిన రిషబ్ పంత్
Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రయాణం ముగిసింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. శనివారం ఎకానా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో లక్నోకు ఇది పదో ఓటమి కాగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో సీజన్‌ను ముగించింది. దీనిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విచారాన్ని వ్యక్తం చేశాడు. ఇది తమకు కఠినమైన సీజన్ అని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (72; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆయుష్ బదోని (18 బంతుల్లో 43 పరుగులు) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, చాహల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్ చెరో వికెట్ తీశారు.
ఆతరువాత శ్రేయస్ అయ్యర్ (101 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రన్ సింగ్ (69; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. లక్నో బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీశాడు. అర్జున్ టెండూల్కర్ ఓ వికెట్ పడగొట్టాడు.
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. నిజం చెప్పాలంటే ఈ సీజన్లో తమ ప్రదర్శనను జీర్ణించుకోవడం చాలా కష్టమైన విషయం అని చెప్పాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా ఈ చేదు నిజాన్ని అంగీకరించాల్సిందే. ఈ సీజన్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లుగా తెలిపాడు. ఓ జట్టుగా ఇది కఠినమైన సీజన్ అని, వచ్చే సారి బలంగా తిరిగి వస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. స్కోరు బోర్డు పై తాము తగినన్ని పరుగులు ఉంచినట్లుగా అనుకున్నామన్నాడు. అయితే.. ఎకానాలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నాడు. బౌలింగ్ చేయడం కష్టమన్నాడు. అందుకనే టాస్ గెలిచిన ప్రతి జట్టు కూడా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటుందన్నాడు. జోస్ ఇంగ్లిష్ అద్భుతంగా ఆడాడని అన్నాడు.
ఇక మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో లేనప్పటికి కూడా ఈ సీజన్ అంతటా చక్కగా రాణించాడని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడని తెలిపాడు. గాయం నుంచి మోసిన్ తిరిగి రావడం, షమీ ప్రదర్శన ఇవన్నీ తమకు సానుకూల అంశాలు అని తెలిపాడు.
ఏదీ ఏమైనప్పటికి కూడా ఇది సుదీర్ఘమైన సీజన్ అని, అయినప్పటికీ తాము ధైర్యంగా ముందుకు సాగామన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామని వాగ్దానం చేస్తున్నాం అని పంత్ తెలిపాడు.
