Riyan Parag : నేనే ఔట్ అయ్యా.. మ్యాచ్ పోయింది.. అది సాహసం కాదు.. టీవీల్లో చూస్తే.. రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్..
ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
ipl 2026 Riyan Parag lambasted his team over disappointing show as they failed to beat the Delhi Capitals
- ఢిల్లీ పై ఓటమి
- రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
- కెప్టెన్ రియాన్ పరాగ్ కీలక కామెంట్స్
Riyan Parag : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.
ధ్రువ్ జురెల్ (53; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (51; 26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేయగా వైభవ్ సూర్యవంశీ (46; 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీశాడు. లుంగి ఎంగిడి, మాధవ్ తివారీ లు చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (51; 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (56; 42 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. అక్షర్ పటేల్ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. దాసున్ శనక ఓ వికెట్ పడగొట్టాడు.
అది సాహసం కాదు..
ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. ఓటమి నిరాశ కలిగించిందన్నాడు. నిజానికి ఆర్ఆర్14.1 ఓవర్లలో 161/1 తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈజీగా 230 నుంచి 240 పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే అనూహ్యంగా కుప్పకూలి కనీసం రెండు వందల పరుగులు కూడా చేయలేకపోయింది. దీని గురించి పరాగ్ మాట్లాడుతూ.. 14 ఓవర్ల వరకు తాము చాలా మంచి స్థితిలో ఉన్నామన్నాడు. తాను ఔట్ అయిన తరువాత పరిస్థితి గాడి తప్పిందన్నారు. ఆ మూమెంటమ్‌ను కొనసాగించలేకపోయామని చెప్పుకొచ్చాడు. తమకు లభించిన ఆరంభం చూస్తే 220 నుంచి 230 పరుగులు చేయాల్సి ఉందన్నాడు.
ఇక తమ బౌలింగ్ విషయానికి వస్తే.. ఆశించిన స్థాయిలో బౌలర్లు రాణించలేదన్నాడు. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన సమయంలో ఫెరీరా 18వ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మళ్లింది. దీనిపై పరాగ్ మాట్లాడుతూ.. ఫెరీరాను బౌలింగ్‌కు దించడం పెద్ద సాహసం కాదన్నాడు. టీవీలో చూస్తే అది సాహసంలా కనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఆ సమయంలో క్రీజులో ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. షనకతో మరో ఓవర్ వేయించే బదులు, డోనోవన్తో బౌలింగ్ చేయించి ఒక సాహసం చేయడం మేలు అని అనిపించింది. అయితే.. ఆ ప్రయోగం బెడిసి కొట్టింది. అని పరాగ్ తెలిపాడు
ఇక తమ ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. చాలా పేలవంగా ఉందన్నాడు. ఓ ట్రోఫీని గెలవాలంటే, ప్రతి మ్యాచ్‌లో నిలవాలంటే మెరుగైన ఫీల్డింగ్ అవసరం అని అన్నాడు. గత నాలుగు లేదా ఐదు మ్యాచ్‌ల్లో తమ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోయామన్నాడు. తమ ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తే టాప్-4 లో ఉండలేమన్నాడు.
ఆర్ఆర్ లీగ్ దశలో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీనిపై మాట్లాడుతూ.. రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు మిగిలిన జట్ల సమీకరణాలతో ఆధారపడాల్సి ఉందన్నాడు. అదృష్టం కోసం వేచి చూడకూడదన్నాడు. ఇంత వరకు తెచ్చుకోవడం బాగా లేదన్నాడు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే అది ముమ్మాటికి తమ తప్పేనని అన్నాడు.
