Abhishek Sharma : ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అభిషేక్ శర్మ నువ్వు మామూలోడివి కాదయ్యా..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొట్టాడు.
IPL 2026 SRH vs DC Abhishek Sharma century against delhi breaks multiple records (pic credit@ipl)
- ఢిల్లీ పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
- టీ20 క్రికెట్లో పలు రికార్డులు బ్రేక్
Abhishek Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 21) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోస్తూ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ఆడాడు. 47 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 68 బంతుల్లో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు రికార్డులను అందుకున్నాడు.
50 బంతుల్లోపు రెండు ఐపీఎల్ సెంచరీలను సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అతడు 2025 ఐపీఎల్లో పంజాబ్ పై 40 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు రోహిత్ శర్మను అధిగమించాడు. టీ20ల్లో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ 9 సెంచరీలు చేశాడు. ఇందులో ఐపీఎల్లో రెండు, టీమ్ఇండియా తరుపున రెండు శతకాలు ఉండగా.. మిగిలినవి దేశవాళీ టీ20 క్రికెట్లో చేశాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు..
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ చోటు సంపాదించుకున్నాడు. ఈ జాబితాలో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు. 22 సెంచరీలతో ఈ జాబితాలో క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
* క్రిస్ గేల్ -22 సెంచరీలు
* బాబర్ ఆజామ్ – 12 సెంచరీలు
* డేవిడ్ వార్నర్ – 10 సెంచరీలు
* క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, రిలీ రొసో, సాహిబ్జాదా పర్హాన్, అభిషేక్ శర్మలు తలా 9 సెంచరీలు చేశారు.
ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం..
ఓ టీ20 ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లును అభిషేక్ శర్మ 5 సార్లు నమోదు చేశాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 18 సార్లు అతడు ఈ ఘనతను సాధించాడు. శ్రేయస్ అయ్యర్, ఎవిన్ లూయిస్‌లు చెరో నాలుగు సార్లు ఈ ఘనతను నమోదు చేశారు.
ఐపీఎల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోరు..
అభిషేక్ శర్మ చేసిన స్కోరు ఐపీఎల్లో ఐదో వ్యక్తిగత అత్యధిక స్కోరుగా నిలిచింది. 175 పరుగులతో క్రిస్‌గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా 158 పరుగులతో బ్రెండన్ మెక్కల్లమ్ రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
* క్రిస్ గేల్ – 175* పరుగులు (పూణే వారియర్స్ పై 2013లో ఆర్సీబీ తరుపున ఆడుతూ)
* బ్రెండన్ మెక్కల్లమ్ – 158* పరుగులు (ఆర్సీబీపై 2008లో కేకేఆర్ తరుపున ఆడుతూ)
* అభిషేక్ శర్మ – 141 పరుగులు (పంజాబ్ కింగ్స్ పై 2025లో సన్‌రైజర్స్ తరుపున ఆడుతూ)
* క్వింటన్ డికాక్ – 140 పరుగులు (కేకేఆర్ పై 2022లో లక్నోతరుపున ఆడుతూ)
* అభిషేక్ శర్మ – 135* పరుగులు (ఢిల్లీపై 2026లో సన్‌రైజర్స్ తరుపున ఆడుతూ)
