Rishabh Pant : నేను మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఈ విషయం యాజమాన్యానికి తెలుసని అనుకుంటున్నా.. రిషబ్ పంత్ హాట్ కామెంట్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడం పట్ల కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు
IPL 2026 SRH vs LSG Rishabh Pant comments after Lucknow Super Giants win the match against Sunrisers Hyderabad (pic credit@IPL)
- సన్‌రైజర్స్ హైదరాబాద్ పై విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్
- బౌలర్ల వల్లే ఇదంతా
Rishabh Pant :ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం పట్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే తాము విజయం సాధించామని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62 పరుగులు), నితీశ్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56 పరుగులు) అర్ధశతకాలు బాదారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. దిగ్వేష్ సింగ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్ చెరో వికెట్ సాధించారు.
అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్ఎస్జీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ (50 బంతుల్లో 68 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 45 పరుగులు) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబె రెండు, ఈషాన్ మలింగ, శివంగ్ కుమార్ లు చెరో వికెట్ తీశారు.
నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు
సన్‌రైజర్స్ పై విజయం సాధించడం పట్ల లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా ఇది పెద్ద సానుకూలాంశం అని అన్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ముగించినప్పుడు అది జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందన్నాడు. బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముందుగా బౌలింగ్ చేసినప్పుడు మ్యాచ్ పై పట్టునిచ్చేది వారేనని అన్నాడు.
ముఖ్యంగా షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రతి అద్భుతంగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు. ఇక ఈ రోజే జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ అదరగొట్టాడని అన్నాడు. తమ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్క ఆటగాడి ప్రదర్శనను నిశితంగా విశ్లేషిస్తున్నట్లుగా తెలిపాడు.
ఈ లక్ష్యం గురించి ఎలాంటి పిర్యాదు లేదన్నాడు. మేం గొప్ప ఆరంభాన్ని అందుకున్నాం. ఈ మ్యాచ్‌ను త్వరగా ముంచాల్సి ఉంది. ఓ జట్టుగా నేర్చుకుంటూ, మెరుగుపడాలని చూస్తున్నామని పంత్ అన్నాడు.
ఇక తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ‘అంతా శుభంగా ముగిస్తే దేనికైనా విలువ ఉంటుంది. నేను వ్యక్తిగతంగా చాలా బాగా సన్నద్ధం అవుతానని, నా వంద శాతం కంటే ఎక్కువ ఇస్తున్నాననే విషయం నాకు తెలుసు. దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. నా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో నా సహచరులకు, నా యాజమాన్యానికి తెలుసని నేను అనుకుంటున్నాను.. నా వరకు అదే ముఖ్యం.’ అని రిషబ్ పంత్ అని అన్నాడు.
