IPL ఫైనల్ సమరంలో గెలుపెవరిది: బలాబలాలు

మార్చి 23న మొదలై క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 12ముగింపు దశకు వచ్చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయితే ఇక సీజన్ ముగిసినట్లే. ఓ పక్క కెప్టెన్ కూల్.. మరో వైపు హిట్ మాన్ రోహిత్. ఇరు జట్ల మధ్య బలాబలాలు సమానంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఏ క్షణంలోనైనా గేమ్ ను మలుపు తిప్పగల ప్లేయర్లు చెన్నై జట్టులో ఉంటే, క్షణాల్లో మెరుపుల్లాంటి షాట్ లు కురిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు ముంబై సొంతం. భారీ అంచనాల మధ్య, ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోరు ఎలా ఉండబోతుందంటే..

చెన్నై సూపర్ కింగ్స్: 
ధోనీ నాయకత్వం జట్టుకు ప్రధాన బలం. డాడీస్ ఆర్మీ అని పేరు తెచ్చుకున్న జట్టును అన్ని జట్ల కంటే ముందుగానే నాకౌట్ కు దిట్ట. దాంతోపాటు ఫుల్ ఫామ్ లో ఉండడం ముంబైను కచ్చితంగా ఇబ్బందిపెట్టే అంశం. దానికి తగ్గట్లు ఆఖరి మ్యాచ్ లో ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో మెరవడం చెన్నైకు మరింత బలాన్ని చేకూర్చింది. బౌలింగ్ విభాగానికి వస్తే.. పవర్‌ప్లేలో దీపక్, డెత్ ఓవర్స్‌లో బ్రావో ప్రమాదకరంగా మారిపోతారు. ఇక స్పిన్ త్రయం తాహిర్, హర్భజన్, జడేజాలు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. 

బలహీనతలు
ఐపీఎల్ 12వ సీజన్లో ముంబై చేతిలో వరుసగా 3సార్లు ఓటమి నెత్తినేసుకుంది చెన్నై. రైనా, రాయుడు నిలకడలేమి భారమంతా ధోనీమీదే పడేలా చేస్తుంది. గత ఒక్క మ్యాచ్ మినహాయించి ఓపెనర్లు పేలవంగానే ఆడుతున్నారు. బ్రావో బౌలింగ్ లో మినహాయించి ఆల్ రౌండర్ ప్రదర్శన కనిపించడం లేదు. 

ముంబై ఇండియన్స్
ముంబైకి ప్రధాన బలం హార్దిక్ పాండ్యా, బుమ్రా, డికాక్. హిట్ మాన్ రోహిత్ తో పాటు వీళ్లు కూడా ఊపందుకుంటే ఆ జట్టును ఇక ఎవ్వరూ ఆపలేరు. 3సార్లు టైటిల్ ముద్దాడిన ముంబై.. ఓపెనర్లు నిలబెడితే పరుగుల వరదే. డికాక్, రోహిత్ శుభారంభాన్ని నమోదు చేస్తే సూర్య కుమార్, ఇషాన్ కిషన్ దాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత వరుసలో ఉన్న పాండ్యా ఊపందుకుంటే బౌండరీలు, సిక్సులు మైదానం దాటిపోతున్నాయి. ఇక చివరిగా కీరన్ పొలార్డ్ ఆఖరిలో వచ్చే అణ్వాయుధం లాంటి వాడు. ఫేసర్లు బుమ్రా, మలింగలకు స్పిన్నర్ రాహుల్ చాహర్ తోడై ప్రత్యర్థులను కట్టడి చేయడమే కాకుండా పెవిలియన్ బాటపట్టిస్తున్నారు. లీగ్ మొత్తంలో బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ లో ముంబై ఇండియన్స్ పర్‌ఫెక్ట్ అనడంలో సందేహం లేదు.  

బలహీనతలు
స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్న ముంబైకి తాహిర్, హర్భజన్ సింగ్‌లు పెను సమస్య. సీజన్‌లో ముంబై చేతిలో 3సార్లు ఓడిన పరాభవంతో చెన్నై ఎదురుచూస్తోంది. వ్యూహాల దిట్ట ధోనీ ప్రతీకారం కోసం ఎలాంటి పథకమైన వేయగలడు.