IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్

క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్‌ మరోసారి సెంచరీతో చెలరేగాడు.(IPL2022 Rajasthan Vs RCB)

IPL2022 Rajasthan Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15 క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసింది. ఆపై ఛేదనలో సంజూ సేన దుమ్మురేపింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్‌ (106*) మరోమారు సెంచరీతో చెలరేగాడు. బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి.

ఫలితంగా 158 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ బ్యాటర్లలో బట్లర్‌తో పాటు కెప్టెన్ సంజూ (23), యశస్వి జైస్వాల్ (21) రాణించారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. హసరంగ ఒక వికెట్‌ తీశాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్ తో రాజస్తాన్‌ తలపడనుంది. (IPL2022 Rajasthan Vs RCB)

ఈ మ్యాచ్ లో బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాది ముచ్చెమటలు పట్టించాడు. సూపర్ బ్యాటింగ్ తో రాజస్తాన్ ను ఒంటి చేత్తో గెలిపించాడు బట్లర్. అలాగే ఫైనల్ కు కూడా తీసుకెళ్లాడు. ఈ సీజన్ లో బట్లర్ కు ఇది 4వ సెంచరీ కావడం విశేషం.

IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట

ఫైనల్‌కు చేరాంటే తప్పక గెలవాల్సిన క్వాలిఫయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది. రాజస్తాన్ రాయల్స్ ముందు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్‌ మరోసారి రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఫామ్ నిరూపించుకున్న రజత్ పాటిదార్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాటిదార్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు. అయితే, మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో బెంగళూరు భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు.

VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ (7) మరోసారి విఫలం కాగా, కెప్టెన్ డుప్లెసిస్ 25, మ్యాక్స్ వెల్ 24 పరుగులు పర్లేదనిపించారు. లోమ్రోర్ 8, దినేశ్ కార్తీక్ 6, షాబాజ్ అహ్మద్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

తొలి క్వాలిఫయర్‌లో ఓడిన రాజస్తాన్ క్వాలిఫయర్ 2లో సత్తా చాటగా.. ఎలిమినేటర్‌లో కష్టం మీద గట్టెక్కిన బెంగళూరు.. ఫైనల్‌ బెర్తు కోసం జరిగిన పోరులో చతికలపడింది.

ట్రెండింగ్ వార్తలు