వరల్డ్ కప్ గెలిచిన భారత షూటర్

వరల్డ్ కప్ గెలిచిన భారత షూటర్

Updated On : August 30, 2019 / 7:00 AM IST

భారత షూటర్‌ ఇలవెనిల్ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. గురువారం రియో డి జెనిరో వేదికగా జరిగిన పోటీల్లో గోల్డ్ గెలిచి చరిత్రను లిఖించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అంజలీ భగవత్‌, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్‌ రైఫిల్‌) మూడో మహిళా షూటర్‌గా నిలిచింది. సీనియర్‌ క్రీడాకారిణిగా బరిలో దిగిన తొలిసారే టైటిల్ విన్నర్‌గా నిలవడం విశేషం. 

పోటీలో 251.7 పాయింట్లు సాధించిన ఇలవెనిల్ ప్రథమ స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన సియోనాయిడ్‌ కింటోష్(250.6 పాయింట్లు)‌, తైపీకి చెందిన లిన్‌ మాంగ్‌ చిన్‌(229.9 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలతో నిలిచారు. సీనియర్‌ షూటర్‌, ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ వద్ద ఇలవెనిల్ షూటింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. 

గేమ్ అనంతరం ఇలవెనిల్ మాట్లాడుతూ..‘మ్యాచ్‌కు ముందు కాస్త ఒత్తిడికి లోనయ్యాను. ఒలింపిక్‌ పతకం సాధించాలని మూడేళ్ల నుంచి అనుకుంటున్నాను. ప్రస్తుత విజయం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. మా అకాడమీ గన్‌ ఫర్‌ గ్లోరీకి జాతీయ అవార్డు వచ్చిన రోజే నాకు కూడా పసిడి దక్కడం గర్వంగా ఉంది. ఈ స్వర్ణం నాకెంతో ప్రత్యేకమైంది’ అని సంతోషం వ్యక్తం చేసింది.