PV Sindhu : తెలుగు తేజానికి ఏమైంది..? మళ్లీ తొలి రౌండ్‌లోనే సింధు ఓటమి.. ఈ ఏడాదిలో ఇది 7వ సారి
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలోనూ ఓడిపోయింది.

PV Sindhu
Japan Open 2023-PV Sindhu : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న కొరియా ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టిన సింధు తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. చైనా ప్లేయర్ చేతిలో ఓటమి పాలైంది. కనీస ప్రతిఘటన కూడా లేకపోవడం గమనార్హం. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన జాంగ్ యిమాన్ 21-12, 21-13 తేడాతో సింధును ఓడించింది.
కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీల్లో పాల్గొన్న సింధు 7 టోర్నీల్లో మొదటి రౌండ్‌లోనే ఓటమి పాలు అయ్యింది. ఒలింపిక్స్‌కు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండగా సింధు వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. 30 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. చైనా ప్లేయర్ ముందు సింధు తేలిపోయింది. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే చైనా ప్లేయర్ దూకుడు కనబరిచింది. వరుసగా పాయింట్లు సాధించిన జాంగ్ యిమాన్ మొదటి గేమ్‌ను 21-12 తేడాతో గెలిచింది. రెండో గేమ్‌లో అయినా సింధు పుంజుకుంటుందని భావించగా నిరాశే ఎదురైంది. జాంగ్ యిమాన్ బలమైన స్మాష్‌లతో విరుచుకుపడింది. ఫలితంగా 21-13 తేడాతో జాంగ్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది.
Zhang Yi Man ?? takes on former world champion Pusarla V. Sindhu ??.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/RzycVktT53
— BWF (@bwfmedia) July 26, 2023
సాత్విక్-చిరాగ్ జోడి దూకుడు
ఈ సంవత్సరం నాలుగు టైటిళ్లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌లు జపాన్ ఓపెన్‌లోనూ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-16, 11-21, 21-13 తేడాతో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాడో, డేనియల్ మార్టిన్ జంటను ఓడించింది. రెండో గేమ్ కోల్పోయినప్పటికీ కీలకమైన మూడో గేమ్‌లో సత్తా చాటి విజయాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మెరిశాడు. మొదటి రౌండ్ మ్యాచ్‌లో 21-15, 12-21, 24-22 తేడాతో భారత్‌కే చెందిన ప్రియాన్షు రావత్ పై గెలుపొందాడు.