Jay Shah : ఐసీసీ ఛైర్మన్‌గా జైషా..! గ్రెగ్ బార్‌క్లే పదవి నుంచి తప్పుకోవటంతో లైన్ క్లియర్

ఐసీసీ చైర్మన్ పోస్టుకోసం ఈ ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంది.

Jay Shah

ICC Chairman Jay Shah : బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే తన పదవి నుంచి తప్పుకోవటంతో తదుపరి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టేందుకు జైషా కు రూట్ క్లియర్ అయింది. గ్రెగ్ బార్ క్లే ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. నిబంధనల ప్రకారం పర్యాయానికి రెండేళ్ల చొప్పున ఎవరైనా ఐసీసీ చైర్మన్ గా మూడు పర్యాయాలు ఉండొచ్చు. న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్‌క్లే నాలుగేళ్లు తన పదవిని పూర్తి చేశాడు. మూడోసారి చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. తన పదవీకాలం పూర్తయిన తరువాత ఐసీసీ చైర్మన్ పదవి నుంచి దిగిపోతానని, మరోసారి పోటీచేయబోనని గ్రెగ్ బార్‌క్లే మంగళవారం క్లారిటీ ఇచ్చారు. దీంతో తదుపరి ఐసీసీ చైర్మన్ జై షా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Also Read : పాలిటిక్స్‌లోకి వినేశ్ ఫోగ‌ట్‌.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరితో పోటీ?

ఐసీసీ చైర్మన్ పోస్టుకోసం ఈ ఏడాది నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంది. అయితే, జైషా ఆ సమయంలోపు నామినేషన్ దాఖలు చేస్తే కాబోయే ఐసీసీ చైర్మన్ జైషానే అని క్లారిటి వచ్చినట్లే. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉంటాయి. తొమ్మిది ఓట్లు లభించిన వ్యక్తి విజయం సాధిస్తాడు. జైషా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతి. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు జైషా పట్ల సానుకూలతతో ఉన్నాయి. జైషా బరిలోనిలిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐసీసీ చైర్మన్ గా జైషా విజయం సాధిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఐసీఐ) అధ్యక్ష, బీసీసీఐ కార్యదర్శి పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. బీసీసీఐ కార్యదర్శిగా జైషాకు మరో ఏడాది పదవీకాలం ఉంది. ఆ తరువాత అతడు నిబంధనల ప్రకారం మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి. బీసీసీఐలో ఎలాంటి పదవుల్లో ఉండకూడదు. ఈ నేపథ్యంలో జైషా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని వాదనకూడా ఉంది.

Also Read : యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన డారియస్ విస్సర్.. ఏ దేశపు బ్యాటరో తెలుసా?

2009లో జైషా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్ బోర్డు సభ్యునిగా క్రికెట్ పరిపాలన రంగంలోకి ప్రవేశించాడు. 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయ్యాడు. ఈ సమయంలో అతను ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. 2015లో బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న జైషా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. జైషా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు