అనిల్ కుంబ్లే చెత్త వ్యూహం.. గెలవాలి కానీ ఓడిపోయింది.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు ఆవిరి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత అద్భుతమైన జట్లలో ఒకటైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో మాత్రం ఆఖర్లో ఉంది. వరుసగా ఐదవ మ్యాచ్ ఓడిపోవడంతో ఐపీఎల్ టోర్నమెంట్‌లో 100 మ్యాచ్‌లు ఓడిపోయిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌కు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.. కానీ చివరకు ఓడిపోయింది. ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే తీసుకున్న నిర్ణయం జట్టు ఓటమికి కారణం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
ఐపీఎల్ 2020 యొక్క 24 వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు, కెప్టెన్ దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓపెనర్ షుబ్మాన్ గిల్ అర్ధ సెంచరీ తరువాత, కెప్టెన్ వచ్చి 29 బంతుల్లో 58 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించడమే కాకుండా ఫస్ట్ వికెట్‌కు 115పరుగుల పార్ట్‌నర్ షిప్ అందించారు. కానీ చివరికి వరుస వికెట్లు పడటంతో జట్టు 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.
17 వ ఓవర్ ముగిసే సమయానికి, పంజాబ్ జట్టు 1 వికెట్ నష్టంతో 147 పరుగులు చేసి, గెలవడానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరం. 18 వ ఓవర్లో, మ్యాచ్ మారిపోయింది. పంజాబ్ పేలవమైన ఆటతీరుకు నిదర్శనం ఈ మ్యాచ్‌గా నిలిచింది. అంతేకాదు అనీల్ కుంబ్లే తప్పుడు వ్యూహం కూడా ఇందుకు ఓ కారణం. వాస్తవానికి పూరన్ వికెట్ పడిపోయిన సమయంలో 144పరుగులు చేసి ఉంది పంజాబ్. ఆ సమయంలో లోకేష్ రాహుల్‌కు తోడుగా.. పెద్దగా అనుభవం లేని వికెట్‌కీపర్ సిమ్రాన్‌సింగ్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. అప్పుడు వాస్తవానికి మణిదీప్ సింగ్ కానీ, మ్యాక్స్‌వెల్ కానీ ఆడడానికి వచ్చి ఉంటే ఆటతీరు వేరేలా ఉండేది.
సిమ్రాన్ సింగ్ 19వ ఓవర్‌లో నాల్గవ బంతిపై అవుటయ్యాడు. 7బంతుల్లో 4పరుగులు మాత్రమే చివరి ఓవర్లలో చెయ్యడం ఓటమికి కారణం అయ్యింది. దీంతో చివరి ఓవర్లో జట్టుకు 14 పరుగులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.
కామెంటరీ ప్యానెల్‌లో కూర్చున్న ఇర్ఫాన్ పఠాన్, ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజాలు గ్లెన్ మాక్స్‌వెల్ వంటి పెద్ద హిట్టర్ జట్టులో ఉంటే, సిమ్రాన్‌ను పంపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పురన్ అవుట్ అయిన తరువాత హెడ్ కోచ్ కుంబ్లే మాక్స్‌వెల్‌ను పంపలేదు. ఈ పొరపాటే మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అయ్యింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‍కు ఆఖరి ఓవర్లలో కొద్ది పరుగులు మాత్రమే చెయ్యడం పెద్ద కష్టమేం కాదు.. చివరి ఓవర్లో నరైన్ ఓవర్లో కూడా రెండు ఫోర్లు కొట్టాడు. మ్యాక్స్‌వెల్ నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది.