IPL 2024 : సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ!

IPL 2024 : లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ (107; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సు) సెంచరీతో విజృంభించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

IPL 2024 : సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ!

Rajasthan Royals beat Kolkata Knight Riders by 2 wickets

IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ప్లేయర్ జోస్ బట్లర్ (107; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సు) అద్భుతమైన సెంచరీతో విజృంభించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులతో విజయాన్ని అందుకుంది. రాయల్స్ జట్టును గెలిపించిన బట్లర్ (107/60)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ ఐపీఎల్ సీజన్‌‌లో బట్లర్‌కు రెండో సెంచరీ కాగా, మొత్తం ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 7వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (19) పరుగులకే చేతులేత్తేయగా, రియాన్ పరాగ్ (34), రోవ్మాన్ పావెల్ (26), సంజు శాంసన్ (12), ధృవ్ జురెల్ (2), రవిచంద్రన్ అశ్విన్ (8) పరుగులు చేయగా, హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్ ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకుంది.

సునీల్ నరైన్ సెంచరీ వృథా :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌‌కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నరైన్ (106; 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్)తో సెంచరీతో రాణించగా, అంగ్రిష్ రఘువంశీ (30), రింకూ సింగ్ (20), శ్రేయాస్ అయ్యర్ (11), ఫిల్ సాల్ట్ (10), ఆండ్రీ రస్సెల్ (13), వెంకటేష్ అయ్యర్ (8) పరుగులకే పరిమితం అయ్యారు.

అయినప్పటికీ కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. దాంతో ప్రత్యర్థి జట్టు రాజస్థాన్‌కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.

అగ్రస్థానంలో రాజస్థాన్ :
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 1 ఓడింది. మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 2 మ్యాచ్ ఓడింది. దాంతో 8 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది.

Read Also : ఎస్ఆర్‌హెచ్‌, ఆర్సీబీ మ్యాచ్.. ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో తెలుసా?