Vinod Kambli: ఐసీయూలో వినోద్ కాంబ్లీ.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి.. కాంబ్లీ ఏమన్నారంటే?

కాంబ్లీ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Vinod Kambli: ఐసీయూలో వినోద్ కాంబ్లీ.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి.. కాంబ్లీ ఏమన్నారంటే?

Updated On : December 24, 2024 / 1:03 PM IST

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. థానేలోని ఆకృతి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. వినోద్ కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

యూరినరీ ఇన్‌ఫెక్షన్, కాళ్లలో తిమ్మిరి వంటి సమస్యలతో కాంబ్లీ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయనకు ఆసుపత్రి సిబ్బంది పలు వైద్య పరీక్షలు చేశారు. కాంబ్లీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఇవాళ మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్ వివేక్ త్రివేది తెలిపారు.

ప్రస్తుతం కాంబ్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ, కాంబ్లీ ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉందని తెలిపారు. కాంబ్లీ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఆగస్టులో వినోద్ కాంబ్లీకి సంబంధించి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆయన న‌డ‌వ‌డానికి కూడా ఎంతో ఇబ్బందిపడుతున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

కాగా, ఇవాళ కాంబ్లీ ఆసుపత్రి బెడ్‌పై నుంచే మీడియాతో మాట్లాడుతూ.. “ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను ఈ క్రికెట్‌ను ఎన్నటికీ విడిచివెళ్లను. ఎందుకంటే నేను కొట్టిన సెంచరీలు, డబుల్ సెంచరీల గురించి నాకు గుర్తుంది. మా కుటుంబంలో మేము ముగ్గురం ఎడమచేతి వాట ఆటగాళ్లం. సచిన్ టెండూల్కర్ దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు. స‌చిన్ టెండూల్క‌ర్‌కి కాంబ్లీ మంచి స్నేహితుడు.

Manu Bhaker father : మ‌ను భాక‌ర్ తండ్రి ఆవేద‌న‌.. త‌ప్పు చేశాను.. షూట‌ర్‌ను కాకుండా..