చెత్త రికార్డు: 24 పరుగులకే ఆలౌట్

ఒమన్ వేదికగా జరుగుతోన్న లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు చోటు చేసుకుంది. అల్ అమ్రెట్ క్రికెట్ గ్రౌండ్‍లో స్కాట్‌లాండ్, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యల్పమైన స్కోరు నమోదైంది. ఓవర్లన్నీ వృథా చేస్తూ వికెట్ కాపాడుకోవడానికే ఆపసోపాలు పడ్డారు బ్యాట్స్‌మెన్. అందులో ఆరుగురు డకౌట్‌గానే వెనుదిరిగారు పాపం. ఎట్టకేలకు 17.1 ఓవర్ల వరకూ ఆడిన ఒమన్ జట్టు కేవలం 24 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
ఒమన్ 5 ఓవర్లు ముగిసేసరికి 8 పరుగుల చేసి 4 వికెట్లు కోల్పోయింది. అందులో 3 డకౌట్‌లు. ఈ దశలో ఖాన్వర్ అలీ 33 బంతులు ఎదురుకొని 15 పరుగులు చేసి జట్టు 20 పరుగుల లోపు ఆలౌట్ కాకుండా కాపాడాడు. అయితే అతనితో పాటు మరో ముగ్గురు మాత్రమే 10 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నారు. వచ్చిన 24 పరుగుల్లో 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. ఆ తర్వాత స్కాట్‌లాండ్ జట్టు మాత్రం సమయాన్ని వృథా చేయలేదు. కేవలం 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి వికెట్ కోల్పోకుండా విజయాన్ని సాధించింది.
ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో నాలుగో అత్యల్ప స్కోర్. ఈ చెత్త రికార్డు జాబితాలో వెస్టిండీస్ అండర్ 19 జట్టు ఇప్పటికే మొదటిస్థానంలో ఉంది. 2007లో జరిగిన మ్యాచ్‌లో విండీస్ అండర్ 19 జట్టు బార్బడాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 14.3 ఓవర్లలో 18 పరుగులకే ఆలౌట్ అయింది. 2012లో కాల్ట్స్ సీసీ జట్టు సరాకెన్స్ ఎస్పీ జట్టుతో తలపడి 19 పరుగులకే పరిమితమైంది. 1974లో యార్క్ షైర్ జట్టుతో మిడిల్ సెక్స్ జట్టు తలపడి 23 పరుగులు మాత్రమే చేయగలిగింది.