Michael Vaughan Trolls Rohit Sharma After Poor form During IPL 2025
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై విజయం సాధించడంలో పేసర్ అశ్వనికుమార్ (4 వికెట్లు), ఓపెనర్ రియాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్) లు కీలక పాత్ర పోషించారు. అయితే.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 12 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
హిట్‌మ్యాన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ పై విమర్శలు మొదలు అయ్యాయి. రోహిత్ శర్మ కాకుండా మరో ఆటగాడు ఇలాంటి గణాంకాలను నమోదు చేసి ఉంటే.. ఇప్పటికే జట్టులో చోటు కోల్పోయి ఉండేవాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చెప్పాడు.
IPL 2025 : వామ్మో కాస్ట్‌లీ ప్లేయర్.. సింగిల్ రన్‌కు రూ.2.7 కోట్లు.. కెప్టెన్సీ ఇవ్వలేదనే..
అతడు కెప్టెన్ కాదు..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ కానందున రోహిత్‌ను పూర్తిగా బ్యాటర్‌గా ఎలా నిర్ణయిస్తారో వాన్ హైలైట్ చేశాడు. ఈ బ్యాటర్‌ను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగిస్తున్నారని, చాలా మ్యాచ్‌లలో ఫీల్డ్‌లో అతని అనుభవాన్ని ఉపయోగించకూడదని ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందన్నాడు.
‘ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. ఒకవేళ అతడు ముంబై కెప్టెన్ అయి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ ఇప్పుడు అతడు కెప్టెన్ కాదు. ఓ బ్యాటర్‌గా ఈ గణాంకాలు సరిపోవు.’ అని వాన్ అన్నాడు.
MI vs KKR : మేం చేసిన పొరబాటు అదే.. ముంబై చేతిలో ఓటమి తరువాత కోల్‌కతా కెప్టెన్ రహానే కామెంట్స్..
అతడి పేరు రోహిత్ శర్మ కాకపోయింటే (రోహిత్ కాకుండా మరో ఆటగాడు ఇలాంటి గణాంకాలను నమోదు చేసి ఉంటే).. ఈ పాటికే అతడు జట్టులో స్థానం కోల్పోయి ఉండేవాడని వాన్ చాలా గట్టిగా చెప్పాడు. జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే అతడు పరుగులు చేయాల్సింది ఉందని అభిప్రాయపడ్డాడు.
జట్టు యాజమాన్యం, రోహిత్ శర్మ లు ఈ విషయం గురించి చర్చించుకోవాలి. హిట్ మ్యాన్ ఫామ్‌ను అందుకునేందుకు ఓ మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందన్నాడు. ఓ సీనియర్ ఆటగాడు రాణిస్తే.. యువకులు వారిని ఆదర్శంగా తీసుకుంటారన్నాడు. రోహిత్ ఇలాగే ఆడుతూ పోతే అతడు జట్టుకు భారంగా మారుతాడని వాన్ తెలిపాడు.