MI vs KKR : మేం చేసిన పొరబాటు అదే.. ముంబై చేతిలో ఓటమి తరువాత కోల్‌కతా కెప్టెన్ రహానే కామెంట్స్..
సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.

Courtesy BCCI
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. సమిష్టి బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయినట్లుగా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసింది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. కోల్‌కతా బ్యాటర్లలో అంగ్క్రిష్ రఘువంశీ (26), రమణ్‌దీప్ సింగ్ (22) లు రాణించారు. మనీష్ పాండే (19), రింకూ సింగ్ (17) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0) లతో పాటు కెప్టెన్ అజింక్యా రహానే (11), వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (3)లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విష్నేష్ పుతూర్, మిచెల్ సాంట్నర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
MI vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి విజయం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్ వైరల్..
అనంతరం ర్యాన్ రికెల్టన్ (62 నాటౌట్; 41 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (27 నాటౌట్; 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవడంతో బౌలర్లు ఏం చేయలేకపోయారన్నాడు.
Riyan Parag : కెప్టెన్‌గా తొలి విజయం.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ..
‘టాస్ సమయంలో చెప్పినట్లుగానే ఈ పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలం. ఈ పిచ్ పై 180 నుంచి 190 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ వికెట్ పై మంచి బౌన్స్ ఉంది. ఇది సమిష్టి బ్యాటింగ్ వైఫల్యం. బౌలర్లు తమ శక్తి మేరకు ప్రయత్నించారు. అయితే.. స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు లేవు. దీంతో వారు ఏం చేయలేకపోయారు.’ అని రహానే అన్నాడు.
పవర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయామని, ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను చేజార్చుకున్నామన్నాడు. భాగస్వామ్యాలు ముఖ్యం అని, ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరి వరకు ఓ బ్యాటర్ నిలబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకోవాలని రహానే తెలిపాడు.