ధోనీ గద్దలా: మరోసారి అభిమానితో పరుగుపందెం

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2018 విజేత.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటిల్ ఫేవరేట్‌గా 2019 సీజన్‌లో అడుగుపెట్టబోతుంది. ప్రాక్టీస్ ముమ్మరంగా జరుగుతోంది.  ప్రాక్టీస్ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులను స్టేడియంలోనికి అనుమతించారు. రోజంతా ప్రాక్టీస్ పూర్తి చేసుకుని ప్లేయర్లంతా విరామం తీసుకుంటుండగా స్టేడియంలో నుంచి ఓ అభిమాని ధోనీ వైపుకు దూసుకెళ్లాడు. 

అది గమనించిన ధోనీ సూపర్ కింగ్స్ సహాయ బౌలర్‌ను అడ్డుపెట్టుకుని కాసేపు ఆడించాడు. ఓ వ్యక్తిని మధ్యలో పెట్టుకుని 2 రౌండ్లు కొట్టించాడు. ఆ తర్వాత పరుగు మొదలుపెట్టాడు. అభిమాని కోసం సరదాగా పరిగెత్తిన ధోనీని వేగంగా వెంబడించినా అందుకోలేకపోయాడు. ఈ లోగా సెక్యూరిటీ అభిమానిని పట్టేసుకున్నారు. అది గమనించిన ధోనీ మళ్లీ వెనక్కి వచ్చి అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 

నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన రెండో వన్డేలోనూ ధోనీ ఇదే తరహాలో అభిమానిని ఆటపట్టించాడు. ఆ మ్యాచ్ విజయంతో టీమిండియా మైదానంలో ఉండగానే పరుగున వచ్చిన అభిమానిని సహచరుల మధ్య దాక్కుంటూ కాసేపు ఆడుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ లీగ్‌లోనే తొలి మ్యాచ్‌ను చెపాక్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 23న ఆడనుంది.