ధోనీ.. కోహ్లీ.. రోహిత్ కెప్టెన్‌గా ప్రేరణనిచ్చారు: శ్రేయాస్

ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఢిల్లీ జట్టు ఊపందుకుంది. 2018లో గౌతం గంభీర్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్తూ.. సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ 2019సీజన్‌లో జట్టును విజయపథంలో నడిపించాడు. ప్లేయర్లను సమన్వయపరచుకుంటూ క్వాలిఫయర్ 2మ్యాచ్ వరకూ తీసుకురాగలిగాడు. 

లీగ్‌లో జట్టును ఓ కెప్టెన్‌గా విజయవంతంగా నడిపించడానికి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రేరణగా నిలిచారని కొనియాడాడు. ‘కెప్టెన్‌గా రాణించేందుకు వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. టాస్ వేసే సమయంలో వారితో కలిసి నిల్చొనే అదృష్టం దక్కింది. చివరి మ్యాచ్‌లో మేం అనుకున్న పరుగులు చేయలేకపోయాం.  పవర్ ప్లేలో స్పిన్నర్ల ధాటికి పరుగులు చేయలేకపోయాం. బ్యాట్స్‌మెన్ ఎవరూ బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోయారు. చక్కని భాగస్వామ్యం నమోదు చేయకపోవడమే ఓటమికి కారణం’ అని మ్యాచ్ ఓటమి అనంతరం చెప్పుకొచ్చాడు. 

మే 10శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 9వికెట్లు నష్టపోయి 148పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చేధనకు దిగిన చెన్నై ఓపెనర్లు చెరో హాఫ్ సెంచరీతో శుభారంభం చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ లాంచనాన్ని పూర్తి చేసి జట్టుకు విజయం అందించారు.