కివీస్ వన్డేలో ధోనీ వ్యూహానికి ట్రెంట్ బౌల్ట్ బలి

వ్యూహరచనలో ప్రస్తుత క్రికెట్‌లో ధోనీ తర్వాతే ఎవరైనా. ఫార్మాట్ ఏదైనా వికెట్ల ఉండి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడంలో ధోనీ దిట్ట. బ్యాటింగ్ తీరును పసిగట్టి బలహీనతను చక్కగా వాడుకుంటాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడంలో భారత్ బౌలర్లకి సాయపడిన ధోనీ.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కూడా తన వ్యూహంతో మరోసారి సక్సెస్ అయ్యాడు. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. 37.5 ఓవర్లు ముగిసే సమయానికి 157/9తో నిలిచింది.
మిగిలి ఉన్న ఒకే ఒక్క వికెట్‌ను పడగొట్టేందుకు కుల్దీప్ యాదవ్‌తో కలిసి వ్యూహ రచన చేశాడు ధోనీ. ఇంకేముంది అనుకున్నట్లుగానే బౌల్ట్ స్పందించడంతో 38 ఓవర్లలోనే కివీస్ 157 పరుగులకి ఆలౌటైంది. క్రీజులో ఉన్న న్యూజిలాండ్ ఆఖరి బ్యాట్స్‌మెన్ ట్రెంట్ బౌల్ట్ (1: 10 బంతుల్లో) బంతిని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుండటాన్ని ధోనీ పసిగట్టాడు. కుల్దీప్ యాదవ్‌కి వికెట్ల వెనుక నుంచి సూచనలు చేశాడు.
బంతిని వికెట్లకి ఏమాత్రం లోపలికి వేయద్దని వెలుపలగా విసరమంటూ హెచ్చరించాడు. ఈ క్రమంలోనే స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మని అలర్ట్‌గా ఉండమని పిలుపునిచ్చాడు. సరిగ్గా అనుకున్నట్లే అయింది భారత్‌కు చివరి వికెట్ పథకం ప్రకారమే దక్కింది. దీంతో.. ఆ బంతిని ప్లిక్ చేసేందుకు బౌల్ట్ ప్రయత్నించి బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో క్యాచ్ కోసం సిద్ధంగా ఉన్న రోహిత్ శర్మ చేతికి చిక్కింది. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో ధోనీ సూచనల్ని పెడచెవిన పెట్టిన కుల్దీప్ యాదవ్‌ని ‘బౌలింగ్ మారుస్తావా..? లేక బౌలర్‌ని మార్చమంటావా..?’ అంటూ ధోనీ గట్టిగా చురకలు అంటించిన సంగతి తెలిసిందే.