Smriti Mandhana: పెళ్లి పీటలు ఎక్కబోతున్న భారత స్టార్ మహిళా క్రికెటర్..! ఈ సంగీత దర్శకుడే వరుడు..!
2019 నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

Smriti Mandhana: స్మృతి మంధాన.. పరిచయం అక్కర్లేని పేరు. భారత స్టార్ మహిళా క్రికెటర్. స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వరుడు ఎవరో తెలుసా.. ఓ సంగీత దర్శకుడు. మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్ ను స్మృతి పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్ గురించి మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్.. రివీల్ చేశారు. దాంతో త్వరలో వీరిద్దరి వివాహం జరగనుందని సమాచారం. క్రికెట్ గ్రౌండ్ అద్భుతంగా రాణిస్తున్న ఈ స్టార్ ప్లేయర్.. త్వరలో వైవాహిక జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.
పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన రిలేషన్ గురించి ఇప్పటికే అనేక ఊహాగానాలు ఉన్నాయి. 2019 నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తాను మంధానను వివాహం చేసుకోబోతున్నట్లు పలాష్ ముచ్చల్ అఫీషియల్ గా తెలిపారు.
ఇటీవల ఇండోర్‌లో జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో పలాష్ తనదైన రీతిలో తమ మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించారు. స్టార్ బ్యాటర్‌తో బంధం గురించి పలాష్‌ను అడిగినప్పుడు, అతను నవ్వి, “ఆమె త్వరలో ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే” అని అన్నారు. అంతేకాదు.. “నేను మీకు హెడ్‌లైన్ ఇచ్చాను” అని పలాష్ సరదాగా అన్నారు. పలాష్ ముచ్చల్ ది కూడా ఇండోర్. అయితే, దీనిపై స్మృతి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన.. చాలాసార్లు పలాష్ ముచ్చల్‌తో కలిసి కనిపించింది. అలాగే పలాష్ కూడా టీమిండియా ఆడే చాలా మ్యాచులకు హాజరయ్యాడు.
2014లో డిష్కియాన్ అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన పలాష్ ముచ్చల్.. దాదాపు 15 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. 29 ఏళ్ల స్మృతి మంధాన ప్రస్తుతం ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నీలో భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
కొన్ని నెలలుగా స్మృతి-పలాష్ ఫోటోలలో కలిసి కనిపించారు. ఇది వారి రిలేషన్ గురించి చర్చకు దారితీసింది. అయితే, వారిద్దరూ ఇప్పటివరకు ఆ పుకార్లను బహిరంగంగా ప్రస్తావించలేదు.
భారత వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన సెప్టెంబర్ 2025 సంవత్సరానికి ఐసిసి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యారు. ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కు ముందు ఆమె బ్యాటింగ్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరిచినందుకు ఈ అవార్డును గెలుచుకున్నారు.
Also Read: అందుకనే తొలి వన్డేలో ఓడిపోయాం.. లేదంటేనా.. గిల్ కామెంట్స్..