వారు నా గురించి అనుకున్నది తప్పని నిరూపించాలనుకున్నాను.. నిరూపించాను: నితీశ్ కుమార్ రెడ్డి
ఇది తనకు, తన తండ్రికి కూడా ప్రత్యేకమైన సెంచరీ అని నితీశ్ చెప్పాడు.

©ANI
విమర్శకుల నోళ్లు మూయించాలనుకున్నాడు. తనపై నమ్మకం లేదని చెప్పిన వారికి తన బ్యాటింగ్ తీరుతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. చివరకు అదే చేశాడు. విమర్శించిన వారే తన ప్రతిభను చూసి “వావ్” అనేలా చేసుకున్నాడు. అతడే టీమిండియా యువ సంచలనం, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో సెంచరీ బాది టీమిండియాను ఆదుకున్న నితీశ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపాడు. “టీమ్‌లో నేను అందరికంటే ఎక్కువ స్కోర్ సాధించగలనా? అని కొందరు నాపై అనుమానాలు పెట్టుకున్నారు. ఇంత పెద్ద సిరీస్‌లో రాణించలేడని అనుకున్నారు. నా గురించి వారు అనుకున్న మాటలు తప్పని నేను రుజువు చేయాలనుకున్నాను. టీమిండియా కోసం 100 శాతం సామర్థ్యంతో ఆడడానికే నేను ఇక్కడ ఉన్నాను” అని నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు.
ఐపీఎల్ సీజన్ తర్వాత తాను తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలుసుకున్నానని నితీశ్ తెలిపాడు. అందుకు తాను ఓ ప్రణాళిక వేసుకున్నానని చెప్పాడు. తాను ఖాళీగా ఉన్న సమయంలో బ్యాటింగ్‌పై బాగా దృష్టి పెట్టానని తెలిపాడు. ఇప్పుడు అదే మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పాడు.
ఒక్క నెల లేదా రెండు నెలలు కాదని, రెండు-మూడేళ్లుగా ఆటతీరుపై దృష్టి పెట్టానని, అందుకే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నానని తెలిపాడు. తనను నమ్మిన మొదటి వ్యక్తి తన తండ్రి అని చెప్పాడు. తనను నమ్మి తన తండ్రి ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారని తెలిపాడు.
తనను గ్రౌండుకి, జిమ్‌కి తీసుకెళ్లేవారని, ఎల్లప్పుడూ తనతోనే ఉండాలని కోరుకునేవారని నితీశ్ కుమార్ చెప్పాడు. తన తండ్రి తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నాడు. ఇప్పుడు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాగా ఆడానని తెలిపాడు.
ఇది తనకు, తన తండ్రికి కూడా ప్రత్యేకమైన సెంచరీ అని నితీశ్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీని చూస్తున్నానని, అతను తన స్ఫూర్తి అని, ఇప్పుడు అతనితోనే మ్యాచులో ఆడానని తెలిపాడు. కోహ్లీ పెర్త్‌లో సెంచరీ సాధించినప్పుడు, తాను నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్నానని చెప్పాడు.
IND vs AUS : ఓవైపు మ్యాచ్ జరుగుతుండగానే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..