ఎబోలా, సార్స్, స్వైన్ ఫ్లూ… ఇలా ఎన్ని వైరస్‌లు వచ్చినా తట్టుకుని నిలబడిన మానవాళి కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతుంది. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే నాలుగొందలకు పైగా అనుమానితులు.. ముప్పై మంది వరకు ఖరారైన కేసులు.. ప్రపంచంలోకెల్లా ప్రజావైద్యం, సాధనసంపత్తి, యంత్రాంగాన్ని పరుగులెత్తించే వ్యవస్థలు పటిష్టంగా ఉన్న చైనాయే కరోనా దెబ్బకు తల్లడిల్లిపోగా ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటీ? అని ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఈ వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేసేవరకు అవస్థలు తప్పవు కదా? ఈ క్రమంలోనే ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే టోక్యో 2020 ఒలింపిక్స్ వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. అంతర్జాతీయంగా ఇప్పటికే జరగాల్సిన క్రీడా పోటీలు, ఒలింపిక్ ఈవెంట్లు రద్దు అవ్వగా.. ఎక్కువగా జనాభా గుమికూడే పరిస్థితులను తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతుంది.
ఈ క్రమంలోనే భారత్ వేదికగా మార్చి 29వ తేదీన ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పడిప్పుడే ఇండియాలో ప్రవేశించిన కరోనా వైరస్ ఐపీఎల్ కారణంగా ఇంకా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపిఎల్ ) ప్రారంభం కావడానికి ఇంక కేవలం 24 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఇందులో 70మంది విదేశీ క్రికెటర్లు, డజనుకు పైగా ఎలైట్-ప్యానెల్ అంపైర్లు మరియు మ్యాచ్ రిఫరీలు, వివిధ దేశాల నుండి అనేక మంది వ్యాఖ్యాతలు మరియు మీడియా వస్తుంది. వారి ద్వారా కరోనా దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని భావస్తుంది. అంతేకాదు ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రజలు ఎక్కువగా ఒక చోటకు చేరుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధతలు నెలకొన్నాయి.
అయితే,మార్చి 12వ తదీ నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌కు కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. కరోనా వైరస్ గురించి ఐపీఎల్ గురించి చర్చించిన సమావేశంలో మాట్లాడలేదని తెలిపాడు. ప్రస్తుతానికి వైరస్ వల్ల ఎలాంటి ముప్పు లేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కూడా వెల్లడించాడు.
ఇక మార్చి 12వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 12 నుంచి ధర్మశాల వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది.