Pakistan qualifies for ODI World Cup 2025 to be hosted in India
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐసీసీ ఉమెన్స్ వన్డే ప్రపంచకప్ 2025 మెగా టోర్నీ జరగనుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగాటోర్నీకి ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్‌లో థాయ్‌లాండ్ పై 87 పరుగుల తేడాతో గెలుపొందింన అనంతరం పాక్ జట్టు అర్హత సాధించింది.
క్వాలిఫయర్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాక్ గెలిచింది. ఇక పాక్ జట్టు వన్డే ప్రపంచకప్ 2025 క్వాలిఫై కావడంతో ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్నారు. పాక్ ఆడే మ్యాచ్‌లను ఏ దేశంలో నిర్వహిస్తారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ మెగా టోర్నీలో ఆతిథ్య హోదాలో భారత్ ఆడనుండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో నిలిచి అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌లో ఆడి పాక్ అర్హత సాధించగా మరో స్థానం కోసం బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ ఏడాది జరిగిన మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్ కు పంపలేమని బీసీసీఐ ఐసీసీకి తెలియజేసింది. ఈ క్రమంలో ఐసీసీ సమక్షంలో బీసీసీఐ, పీసీబీ బోర్డుల మధ్య హైబ్రిడ్ మోడ్‌కు అంగీకారం కుదిరింది. ఛాంపియన్స్ 2025తో పాటు భవిష్యత్తులో జరగనున్న అన్ని టోర్నీల్లో భారత్, పాక్ జట్లు తటస్థ వేదికల్లోనే ఆడతాయి.
ఇక ఇప్పుడు పాక్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ 2025 అర్హత సాధించడంతో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ లలో ఏ దేశంలో పాక్ ఆడే మ్యాచ్‌లను నిర్వహిస్తారో చూడాలి మరి.