PakVsSL Asia Cup 2022 Final : ఆసియా కప్ ఫైనల్.. రెచ్చిపోయిన రాజపక్స.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..

ఆసియా కప్ 2022 ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

PakVsSL Asia Cup 2022 Final : ఆసియా కప్ ఫైనల్.. రెచ్చిపోయిన రాజపక్స.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..

Updated On : September 11, 2022 / 9:36 PM IST

PakVsSL Asia Cup 2022 Final : ఆసియా కప్ 2022 ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మొదట తడబడిన లంక.. ఆపై నిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

లంక బ్యాటర్లలో భానుక రాజపక్స రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 45 బంతుల్లోనే 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరో బ్యాటర్ హసరంగ 21 బంతుల్లో 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రాణించడంతో శ్రీలంక చాలెంజింగ్ స్కోర్ చేయగలిగింది. ధనంజయ డిసిల్వ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న లంకను రాజపక్స, హసరంగ జోడీ ఆదుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో హారీస్ రౌఫ్ మూడు వికెట్లు తీశాడు. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

పాక్‌ బౌలర్ల ధాటికి 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన లంకను భానుక రాజపక్స (71*), హసరంగ (36) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆపై హసరంగ ఔటైనప్పటికీ.. కరుణరత్నే (14*) తోడుగా రాజపక్స చెలరేగడంతో ఆ జట్టు ఛాలెంజింగ్ స్కోర్ సాధించింది. చివరి 10 ఓవర్లలో లంక 103 పరుగులు రాబట్టడం విశేషం.

ఫైనల్ పోరులో పాక్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శ్రీలంక 10 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 67 పరుగులే చేసింది. ఓపెనర్‌ కుశాల్ మెండిస్ (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ధనంజయ డిసిల్వా (28) ఫర్వాలేదనిపించాడు. అయితే నిస్సాంక (8), డాసున్ శనక (2), గుణతిలక (1) ఘోరంగా విఫలమయ్యారు. కాగా, రాజపక్స-హసరంగలు పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆచితూచి ఆడుతూనే పరుగులు సాధించారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తుది పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-4 దశలో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న శ్రీలంక జట్టు టైటిల్ పై కన్నేసింది. చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారీ విజయం సాధించడం శ్రీలంక ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇవాళ్టి ఫైనల్లోనూ అదే ఆటతీరు కనబర్చాలని లంకేయులు భావిస్తున్నారు.

ఇక, పాక్ జట్టును తక్కువ అంచనా వేయడం ప్రమాదకరమే అంటున్నరు అనలిస్టులు. ఆ జట్టులో అనూహ్యరీతిలో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల ఆటగాళ్లకు కొదవలేదంటున్నారు. ఇటీవల విఫలమవుతున్న కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో బ్యాట్ తో రెచ్చిపోతాడని పాక్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఫైనల్లో పాకిస్తాన్ గెలిస్తే మూడోసారి ఆసియా ట్రోఫీని కైవసం చేసుకున్నట్లు అవుతుంది. అప్ఘానిస్తాన్ తో తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత అద్భుతంగా పుంజుకుని మరీ ఫైనల్‌కు చేరుకుంది లంక. గ్రూప్‌ స్టేజ్‌లో ఒక్క ఓటమి తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి తుది పోరుకు దూసుకొచ్చింది. ఈసారి లంక గెలుచుకుంటే మాత్రం ఇది ఆరోసారి అవుతుంది.