PakVsSL Asia Cup 2022 Final : ఆరోస్సారి.. ఆసియా కప్ విజేత శ్రీలంక.. ఫైనల్లో పాకిస్తాన్‌పై ఘనవిజయం

ఆసియా కప్ 2022 టైటిల్ విజేతగా శ్రీలంక నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తా న్ ను చిత్తు చేసిన లంక.. ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆల్ రౌండ్ షో తో శ్రీలంక అదరగొట్టింది. 23 పరుగుల తేడాతో పాక్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.

PakVsSL Asia Cup 2022 Final : ఆరోస్సారి.. ఆసియా కప్ విజేత శ్రీలంక.. ఫైనల్లో పాకిస్తాన్‌పై ఘనవిజయం

Updated On : September 11, 2022 / 11:45 PM IST

PakVsSL Asia Cup 2022 Final : ఆసియా కప్ 2022 టైటిల్ విజేతగా శ్రీలంక నిలిచింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న లంక.. ఫైనల్ మ్యాచ్ లో అదరగొట్టింది. లంక బౌలర్లు మ్యాచ్ ను మలుపుతిప్పారు. తుది పోరులో 23 పరుగుల తేడాతో పాకిస్తా న్ ను చిత్తు చేసిన శ్రీలంక ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఆల్ రౌండ్ షో తో శ్రీలంక దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ లో తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చూపింది.

171 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 147 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు తీశారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచాడు. బ్యాట్ తో మెరిసిన హసరంగ బౌలింగ్ లోనూ రాణించాడు. హసరంగ 3 వికెట్లు తీశాడు. చమిక కరుణరత్నె రెండు వికెట్లు తీయగా, మహీశ తీక్షణ ఒక వికెట్ తీశాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స (71) హాఫ్ సెంచరీతో చెలరేగగా, చివరలో హసరంగ (36) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ జట్టులో రిజ్వాన్‌ (55) టాప్‌ స్కోరర్‌. ఇఫ్తీకర్‌ అహ్మద్‌(32) రాణించాడు. శ్రీలంక ఆసియా కప్ ను గెలవడం ఇది ఆరోసారి.

ఆసియా కప్ ఫైనల్లో టాస్ నెగ్గిన పాక్.. బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన లంక తొలుత తడబడింది. ఆ తర్వాత నిలబడింది. పాక్ ముందు చాలెంజంగ్ టార్గెట్ పెట్టింది.

పాక్‌ బౌలర్ల ధాటికి 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన లంకను భానుక రాజపక్స (71*), హసరంగ (36) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆపై హసరంగ ఔటైనప్పటికీ.. కరుణరత్నే (14*) తోడుగా రాజపక్స చెలరేగడంతో ఆ జట్టు ఛాలెంజింగ్ స్కోర్ సాధించింది. చివరి 10 ఓవర్లలో లంక 103 పరుగులు రాబట్టడం విశేషం. ముఖ్యంగా రాజపక్స రెచ్చిపోయి ఆడాడు. 45 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. హసరంగ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.