రైనా.. రిటైర్మెంట్ అనలేను.. దేశం గర్వంగా తల ఎత్తుకునేలా ఆడావు: ప్రధాని మోడీ

  • Published By: vamsi ,Published On : August 22, 2020 / 09:22 AM IST
రైనా.. రిటైర్మెంట్ అనలేను.. దేశం గర్వంగా తల ఎత్తుకునేలా ఆడావు: ప్రధాని మోడీ

Updated On : August 22, 2020 / 10:07 AM IST

భారత మాజీ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మరో క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తరువాత, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినందుకు వీరిద్దరినీ చాలా మంది అభినందించారు. ఈ క్రమంలో ధోనీ విశిష్టమైన వృత్తిని ప్రశంసిస్తూ ఒక లేఖ రాసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, బ్యాట్స్‌మన్ రైనాను కూడా ప్రశంసిస్తూ లేఖ రాశారు.



ఇందులో తన ఘనతల్ని ప్రస్తావిస్తూ, రైనా ఆట తీరును ప్రశంసించారు. 2011 ప్రపంచకప్‌ విజయంలో రైనా పాత్రను కొనియాడిన ప్రధాని.. ‘ఆగస్టు 15 న మీరు మీ జీవితంలో చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ‘పదవీ విరమణ’ అనే పదాన్ని ఉపయోగించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీరు చాలా చిన్నవాడివి, ఉత్సాహవంతుడివి. నువ్వు క్రికెట్లో జీవించావు. క్రికెట్‌ను శ్వాసించావు. మురాద్‌నగర్‌ వీధుల్లో మొదలైన నీ క్రికెట్‌ ప్రయాణం దేశానికి ప్రాతినిధ్యం వహించే వరకు సాగింది. క్రికెట్ మైదానంలో చాలా చిరస్మరణీయ ప్రయాణం తరువాత, మీరు మీ జీవితంలో రెండవ ఇన్నింగ్స్ కోసం సిద్ధం అవుతున్నారు.

‘తరాలు మిమ్మల్ని మంచి బ్యాట్స్‌మన్‌గా గుర్తుంచుకోవడమే కాదు, ఉపయోగకరమైన బౌలర్‌గా మీ పాత్రను కూడా మరచిపోలేరు. మీ ఫీల్డింగ్ అద్భుతమైనది. ఆటగాళ్లపై ప్రశంసలు మైదానంలోనే కాదు, మైదానం వెలుపల కూడా ఉన్నాయి. మీ ధైర్యం చాలా మంది యువతను ప్రోత్సహిస్తుంది. మీ క్రికెట్ కెరీర్లో, మీరు ఎన్నో గాయాలను ఇతర సమస్యలను ఎదుర్కొన్నారు, కానీ ప్రతిసారీ సవాళ్లను అధిగమించారు. మీరు వ్యక్తిగత రికార్డుల కోసం కాదు, జట్టు మరియు భారతదేశంని గర్వంగా తల ఎత్తుకునేలా చేసేందుకు ఆడారు. సామాజిక సేవలో మీ సహకారం కూడా ప్రశంసనీయం. మహిళా సాధికారత, పరిశుభ్రమైన భారతదేశం మరియు పేదవారికి సహాయం చేయడానికి మీరు ముందున్నారు. క్రీడా ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పస్థాయికి తీసుకుని రావడానికి మీరు చేసిన అన్నిటికీ ధన్యవాదాలు.



భవిష్యత్తులో నువ్వేం చేయదలుచుకున్నా ఇంతే సంతృప్తికరంగా, విజయవంతంగా ఉంటుందని నమ్ముతున్నా. ఇకపై ప్రియాంక, గ్రేసియా, రియోలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం నీకు దక్కింది. క్రీడల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు, యువతలో స్ఫూర్తి నింపేందుకు నీ వంతుగా చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు. అంటూ మోడీ తన లేఖలో రాశారు.

మోడీ రాసిన లేఖపై ట్విట్టర్ ద్వారా స్పందించిన రైనా.. మేం దేశానికి ఆడేటపుడు రక్తాన్ని, స్వేదాన్ని చిందిస్తాం. అందుకు ఈ దేశ ప్రజలతో పాటు ప్రధాని ప్రేమను పొందడం కంటే గొప్ప ప్రశంస మరేదీ ఉండదు. నన్నిలా అభినందిస్తూ శుభాకాంక్షలు అందించిన మోడీ గారికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.