Maria Andrejczyk : అథ్లెట్ గొప్పమనసు.. వేలానికి ఒలింపిక్ మెడల్

ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యమవదు. అందుకే ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే వారి పేరు మార్మోగిపోతోంది. దేశ ప్రజలు నీరాజనం

Maria Andrejczyk : అథ్లెట్ గొప్పమనసు.. వేలానికి ఒలింపిక్ మెడల్

Maria Andrejczyk

Updated On : August 18, 2021 / 9:24 PM IST

Maria Andrejczyk : ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం అంటే అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యమవదు. అందుకే ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే వారి పేరు మార్మోగిపోతోంది. దేశ ప్రజలు నీరాజనం పడతారు. ప్రభుత్వాలు నజరానాల వర్షం కురిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతారు. ఒక్కసారిగా లైఫ్ మారిపోతుంది. అందుకే, ఒలింపిక్స్ లో మెడల్ గెలవడం అందరూ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇక ఒలింపిక్స్ లో గెలిచే మెడల్ ను క్రీడాకారులు ఎంతో అపురూపంగా దాచుకుంటారు.

అయితే పోలాండ్ కు చెందిన జావెలిన్ త్రోయర్ మరియా ఆండ్రెజిక్ మాత్రం అలా చేయలేదు. ఆమె తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ గొప్ప పని కోసం తన మెడల్ ను వేలానికి పెట్టారు. పోల్ మిలోజెక్ అనే 8 నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కోసం.. టోక్యో ఒలింపిక్స్ లో నెగ్గిన సిల్ర్ మెడల్ ను వేలానికి పెట్టారు. ఆ పతకం కోసం ఇప్పటికే 1.25లక్షల డాలర్ల బిడ్ దాఖలైంది. గతంలో అథ్లెట్ మరియా.. బోన్ క్యాన్సర్ తో పోరాడి జయించింది.

రియో ఒలింపిక్స్ లో మరియా 2 సెంటీమీటర్ల తేడాతో మెడల్ కోల్పోయింది. 2017లో భుజం గాయమైంది. టెస్టులు చేయగా 2018లో బోన్ క్యాన్సర్ అని తెలిసింది. అయితే ఆమె భయపడలేదు. జబ్బుని జయించింది. గాయం నుంచి కోలుకుంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ గెలిచి సత్తా చాటింది. తన మెడల్ తో ఓ చిన్నారిని ఆదుకోవాలని నిర్ణయించింది.

పోల్ మిలోజెక్ అనే 8 నెలల శిశువుకు మొత్తం క్రమరహిత పల్మనరీ వీనస్ కనెక్షన్ (TAPVC) ఉంది. ఇది ఊపిరితిత్తుల సిరల ప్రధాన వైఫల్యం. పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర గుండె శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కి రూ.2కోట్ల 86లక్షలు ఖర్చు అవుతాయి. దీంతో ఆ శిశువుకి సాయం అందించాలని మరియా నిర్ణయించింది. ఆపరేషన్ కు అవసరమైన డబ్బు సేకరించేందుకు ఫండ్ రైజింగ్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే తన మెడల్ ను వేలానికి పెట్టింది.

”8 నెలల చిన్నారి గుండెకి తీవ్ర గాయం అయ్యింది. శిశువుకి ఆపరేషన్ చేయాలి. వారి తల్లిదండ్రులు పేద వారు. అంత డబ్బు లేదు. అందుకే వారికి సాయం చేయాలని నిర్ణయించాను. ఫండ్స్ కలెక్ట్ చేయాలని నిర్ణయించాను. ఒలింపిక్స్ లో నేను గెలిచిన మెడల్ వేలానికి వేయడం ద్వారా సాయం చేస్తున్నా” అని మరియా అన్నారు.

మరియా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తున్నారు. అనేకమంది దాతలు డబ్బు సాయం చేస్తున్నారు. ఓ స్టోర్ యాజమాన్యం 1.4కోట్లకు బిడ్ ను గెలిచినట్టు మరియా తెలిపారు. ఇందులో సర్ ప్రైజ్ ఏంటంటే.. ఆ స్టోర్ యాజమాన్యం వేలంలో గెలిచిన మెడల్ ను తిరిగి మరియాకు ఇచ్చేసింది. అంతేకాదు భారీగా డబ్బు సాయం కూడా చేసింది. మరియా ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇప్పటివరకు 90శాతం వరకు నిధులు వచ్చాయి.