Border-Gavaskar Trophy : రెండో టెస్టుకు టీమిండియా రెడీ, సిరీస్ నుంచి షమీ అవుట్

Border-Gavaskar Trophy : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్ (Adelaide)లో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన భారత జట్టు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. ఇకపై కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) అందుబాటులో ఉండకపోవడం, గాయం కారణంగా మహ్మద్ షమీ (Mohammed Shami) సిరీస్‌కు దూరం కావడంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. తొలి టెస్టులో దారుణంగా ఆడి తీవ్ర విమర్శలు మూటకట్టుకున్న ఓపెనర్ పృథ్వీషాతో పాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాహా స్థానంలో రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
పృథ్వీ షా ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక, కోహ్లీ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేయనున్నారు. తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమీ స్థానంలో జట్టులోకి సిరాజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ శర్మ కనుక మూడో టెస్టు నాటికి క్వారంటైన్ ముగించుకుని అందుబాటులోకి వస్తే జట్టులో మళ్లీ మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయి. వార్మప్ మ్యాచ్‌లో సెంచరీతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన పంత్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఇంగ్లండ్‌తో సిరీస్ కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.