పీవీ సింధుకి  ఏమైంది? ఎందుకీ తడబాటు?

  • Publish Date - December 13, 2019 / 09:50 AM IST

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఏమైంది? ఎందుకిలా తడబడుతోంది. ఆగస్టులో బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత ఆడే అన్ని మ్యాచ్ ల్లో సింధు తడబడుతోంది. ఆరు బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లలో ఐదు టోర్నీల్లోనూ సింధు తొలి లేదా రెండో రౌండ్ లోనే నిష్ర్కమించింది. ఈ ఏడాదిలో వరల్డ్ టూర్ ఫైనల్లో పోటీపడే 8 మంది క్రీడాకారుల్లో డిఫెడింగ్ ఛాంపియన్ గా సింధు మాత్రమే బరిలో నిలిచింది.

మరోవైపు టోక్యో 2020 ఒలింపిక్స్ దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో సింధు ఇలానే తడబాటును పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే మరి. పోటీతత్వ క్రీడలో ఇలాంటి గెలుపోటములు సహజమే. గత నెలలో బసెల్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో గోల్డ్ సాధించిన పీవీ సింధు విజయాల్లో కీలక రోల్ పోషించిన కోచ్ కిమ్ జి హ్యున్ (వ్యక్తిగత కారణాల రీత్యా) వెళ్లిపోవడం కూడా మరింత కఠినంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా సింధు, కోచ్ పుల్లెల గోపిచంద్ మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది.

వరుసగా రెండో ఓటమి :
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన సింధు బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో లీగ్‌ దశలోనే నిష్ర్కమించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సెమీఫైనల్‌ అవకాశాలు సజీవంగా నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లోనూ సింధు ఓటమి తప్పలేదు. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ పోరుకు చేరడమే కాకుండా గతేడాది చాంపియన్‌గా కూడా నిలిచిన పీవీ సింధు ఈసారి నిరాశ పరిచింది.

సింధు నిష్ర్కమణ.. సెమీఫైనల్లో ఆ ఇద్దరు
ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా)తో గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో సింధు 22–20, 16–21, 12–21తో ఓటమి పాలైంది. దీంతో లీగ్ దశలోనే సింధు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అంతకుముందు బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో అకానె యామగూచి (జపాన్)తో తలపడి పరాజయం పాలైంది.

యామగుచి 25–27, 21–10, 21–13తో హి బింగ్‌జియావో (చైనా)పై గెలిచింది. గ్రూప్‌ ‘ఎ’లో గెలిచిన చెన్‌ యుఫె, యామగుచి ఇరువురు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఇక జరగబోయే నామమాత్రపు మ్యాచ్‌ల్లో బింగ్‌జియావోతో సింధు తలపడనుంది.