పంత్.. నాకు కాంపిటీషన్ అనుకోవట్లేదు

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యేకత చాటి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు రిషబ్ పంత్. అలాంటి ఈ యువ క్రికెటర్‌ను తనకు ఎలాంటి కాంపిటీషన్‌గా ఫీలవడం లేదని టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అంటున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తఖ్ అలీ టోర్నీ ఆడుతుండగా సాహా చేతికి గాయానికి గురై టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఆ గాయంతో ఐపీఎల్‌కు కూడా సాహా దూరమవడంతో.. ఆ స్థానంలో పంత్‌ను తీసుకున్నారు.
అందిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న రిషబ్ పంత్.. వికెట్ కీపర్‌గానే కాకుండా భారీగా పరుగులు బాది సత్తా చాటాడు. ఆ ప్రదర్శనే పంత్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టులకు ఎంపిక చేసేలా చేసింది. ఇక దాంతో అడపదడపా అవకాశాలు వస్తూనే ఉండడంతో పంత్ దాదాపు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. మరో వైపు కొన్నేళ్లుగా టీమిండియాలో కీపర్‌గా పాతుకుపోయిన మహేంద్ర సింగ్ ధోనీ.. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి టెస్టు కీపర్‌గా రాణిస్తున్న సాహా.. గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు పంత్.
పంత్ జట్టులో చూపిస్తున్న ప్రదర్శనపై స్పందించిన సాహా.. ‘రిషబ్ పంత్ నేను జట్టుకు దూరమైన సమయంలో వచ్చి సత్తా చాటాడు. ఎవరైనా అవకాశం అందితే చక్కగా వినియోగించుకునేందుకే ప్రయత్నిస్తారు. తాను అలానే చేశాడు. నేను అతణ్ని కాంపిటీషన్‌గా ఫీలవ్వను. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ వచ్చినప్పుడు మేం కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్లం. జట్టు ఎంపిక, మైదానంలో ప్రదర్శనల గురించే మాట్లాడుకునేవాళ్లం’ అని వారిద్ధరి మధ్య ఉన్న క్లోజ్‌నెస్ గురించి వివరించాడు.