Heavy Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు, రేపు ఈ జిల్లాల్లో కుండపోత వానలు..
Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Heavy Rains
Heavy Rains : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం విశాఖపట్టణం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శ్రీకాకుళం, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శుక్రవార వరకు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఇదిలాఉంటే.. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పార్వతీపురంతోపాటు పలు జిల్లాల్లో వర్షం పడింది. విజయనగరం జిల్లా గుర్లలో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ఆగస్టు నెలలో ఏపీలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఐఎండీ గణాంకాల ప్రకారం.. ఏపీలో గత నెలలో 200.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 144.3మిల్లీమీటర్ల కంటే 39శాతం అధికమని ఐఎండీ పేర్కొంది. అయితే, ఆగస్టు నెలలో ఏపీలో అత్యధికంగా శ్రీసత్యసాయి జిల్లాలో సగటున 143శాతం, చిత్తూరు జిల్లాలో 123శాతం, అనకాపల్లి జిల్లాలో 112శాతం, అనంతపురం జిల్లాలో 110శాతం, విశాఖపట్టణంలో 100శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.