Shreyas Iyer : ఉప్పల్‌లో ఆ ఒక్క తప్పుతోనే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్..
ఉప్పల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్పందించాడు.
Shreyas Iyer key comments after west indies beat india 4th T20 match in uppal
Shreyas Iyer : వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతానికి 2-2తో సమమైంది. బౌలర్ల వైఫ్యలమే తమ ఓటమికి కారణం అని టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారని, పిచ్‌కు తగ్గట్టుగా బౌలింగ్ చేయడంలో విఫలం అయ్యారని చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ షై హోప్ (102నాటౌట్; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (49 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (24; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షిమ్రాన్ హెట్‌మైర్ (33; 12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులకే పరిమితమైంది. అర్ష్‌దీప్ సింగ్ రిటైర్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరడంతో భారత ఇన్నింగ్స్ 3 బంతులు ఉండగానే ముగిసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ (56; 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. తిలక్ వర్మ (43; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (41; 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఇషాన్ కిషన్ (6), శ్రేయస్ అయ్యర్ (16), నమన్ ధీర్ (0), అక్షర్ పటేల్ (3) లు విఫలం అయ్యారు.
బౌలర్ల వల్లే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. భారత్ ప్రదర్శన, లక్ష్య ఛేదనలో ఎక్కడ వెనుకబడిందనే దానిపై మాట్లాడుతూ.. ‘ఇదంతా బౌలింగ్‌తోనే మొదలైంది. మా బౌలర్లు సరైన లైన్ అండ్ లైంగ్త్లలో బంతులు వేయలేకపోయారు. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఛేదనలో మా విధానం బాగున్నప్పటికీ, బౌలింగ్‌లో మా ప్రణాళికలను అమలు చేయలేకపోవడం దురదృష్టకరం.. అక్కడే మేము కొంచెం వెనుకబడ్డాము.’ అని శ్రేయస్ అన్నాడు.

ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలో అభిషేక్ శర్మకు పెద్దగా స్ట్రైక్ రాకపోవడం భారత్ ఆరంభంపై ప్రభావం చూపిందా అనే దానిపై మాట్లాడుతూ.. ‘పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ సమయంలో కూడా మేము ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సాధిస్తూనే ఉన్నాము. ప్రత్యర్థి తమ ప్రణాళికను బాగా అమలు చేశారు. మా ఇన్నింగ్స్‌లో పిచ్ కూడా కొంచెం భిన్నంగా ప్రవర్తించింది. బంతి అదనపు బౌన్స్‌తో దూసుకెళ్లింది. వారు ఫీల్డింగ్‌ను చాలా బాగా ఉపయోగించుకున్నారు. కాబట్టి వారికి క్రెడిట్ ఇవ్వాలి. వారు ప్రణాళికలను చాలా అద్భుతంగా అమలు చేశారు.
పిచ్‌పై బంతి కొంచెం ఆగి వస్తోంది, అదనపు బౌన్స్ కూడా ఉంది. వెస్టిండీస్ బౌలర్లు ఈ విషయాన్ని పసిగట్టి మధ్య ఓవర్లలో చాలా చక్కగా బౌలింగ్ చేశారు. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 220 పరుగులు సాధించడం ద్వారా ప్రతి ఆటగాడి విధానం, దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మా విధానం అలాగే ఉంటుంది, ఇకపై మా బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నా భావన. ప్రణాళికను అమలు చేయడం, తాజా దృక్పథంతో బరిలోకి దిగి.. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా రాణించి, అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ‘అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
