Shubman Gill : మూడో వన్డేలో ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలపై ఆందోళన!
Shubman Gill : మూడో వన్డే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. సిరీస్ విజయం పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా కొన్ని అంశాలను మెరుగుపరచాల్సి ఉందని పేర్కొన్నాడు.
Shubman Gill Key Comments after West Indies defeated India in third ODI
Shubman Gill : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డే శనివారం సాయంత్రం న్యూ చండీగఢ్‌లో జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, గత రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Also Read : IND vs PAK : ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు స్వర్ణం.. ఫైనల్లో పాక్ పై భారత్ ఘన విజయం..
మూడో వన్డే ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. సిరీస్ విజయం పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా కొన్ని అంశాలను మెరుగుపరచాల్సి ఉందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్, డెత్ ఓవర్ల బౌలింగ్‌పై వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ స్థాయి మరింత మెరుగుపడాల్సి ఉందని గిల్ తెలిపాడు. ఈ సిరీస్‌లో తమ ఆటగాళ్లు సుమారు ఆరు నుంచి ఏడు క్యాచ్‌లు వదిలేశారని, వరల్డ్‌కప్‌కు ఇలాంటి పరిస్థితి కాస్త ఆందోళన కలిగించే అంశమని.. ప్రపంచకప్‌లో ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉండాలని గిల్ పేర్కొన్నాడు.
చివరి ఓవర్లలో బౌలింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అటాక్ చేయాలా? డిఫెండ్ చేయాలా? అనే విషయంలో స్పష్టత ఉండటం లేదని గిల్ పేర్కొన్నాడు. ప్రత్యర్థి ఐదు లేదంటే ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలి, డెత్ బౌలింగ్‌ను ఎప్పుడు ప్రారంభించాలి అనే అంశాల్లో మరింత వ్యూహాత్మక స్పష్టత అవసరమని చెప్పాడు.
మూడో వన్డేలో భారత్ నాలుగు ఓవర్లు వెనుకబడటం, ఆ తర్వాత డ్యూ ప్రభావం తమపై పడిందని గిల్ అభిప్రాయపడ్డాడు. ఓవర్లు తగ్గించకపోయి ఉంటే మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లే అవకాశం ఉండేదని అన్నాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్లను ముందుగానే పూర్తి చేయకపోవడంపై కూడా గిల్ వివరణ ఇచ్చాడు. గర్నూర్ బ్రార్ క్రాంప్స్‌తో బాధపడటంతో అతను తిరిగి బౌలింగ్ చేయగలడా లేదా అన్న విషయంలో స్పష్టత లేకపోయిందని తెలిపాడు. మ్యాచ్ చివరి వరకు వెళ్తుందని భావించడంతో, వికెట్లు తీయగల కుల్దీప్ ఓవర్లను చివర్లో ఉపయోగించాలని నిర్ణయించినట్లు వివరించాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్), రోహిత్ శర్మ (85 బంతుల్లో 92), రుతురాజ్ గైక్వాడ్ (57 పరుగులు)తో రాణించారు. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతమ బ్యాటింగ్ తీరుతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు చేయగా.. ఐదు వికెట్ల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ షై హోప్ (143 బంతుల్లో 162 నాటౌట్) అసాధారణంగా ఆడి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
