Shubman Gill : పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు శుభ్‌మన్ గిల్ టెన్షన్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings) లో బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్ర స్థానానికి మరింత చేరువ అయ్యాడు.
![Shubman Gill : పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు శుభ్‌మన్ గిల్ టెన్షన్.. Shubman Gill : పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు శుభ్‌మన్ గిల్ టెన్షన్..](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-7-36.jpg)
Shubman Gill-Babar Azam
Shubman Gill-Babar Azam : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings) లో బ్యాటింగ్ విభాగంలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అగ్ర స్థానానికి మరింత చేరువ అయ్యాడు. మొదటి స్థానంలో ఉన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) కంటే కేవలం 10 రేటింగ్ పాయింట్లు మాత్రమే తక్కువగా ఉన్నాడు. బాబర్ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్లు ఉండగా 847 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా వన్డేల్లో గిల్ నిలకడగా రాణిస్తున్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లో వరుసగా 74, 104 పరుగులు చేశాడు. మూడో వన్డేలో అతడికి విశ్రాంతి ఇచ్చారు. ఒకవేళ గిల్ ఈ మ్యాచ్ ఆడి కనీసం 30 పరుగులు చేసినా కూడా అతడు నంబర్ వన్ ర్యాంకుకు చేరుకునేవాడు. గిల్ కనుక ఇదే ఫామ్‌ను అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో కొనసాగిస్తే మాత్రం నంబర్ వన్ ర్యాంకు అతడి సొంతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాబర్‌పై ఒత్తిడి నెలకొంది.
దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ డెర్ డుస్సెన్ 743 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ 729 రేటింగ్ పాయింట్లతో, పాక్ ఆటగాడు ఇమాముల్ హక్ 728 రేటింగ్ పాయింట్లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 30వ ర్యాంకుకు, కేఎల్ రాహుల్ ఆరు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకుకు చేరుకున్నారు.
Harsh Goenka : టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్లకు శాపం తగులుతోందా..? బైజూస్ నుండి డ్రీమ్11 వరకు..!
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులు లేవు. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా పేసర్ జోస్ హేజిల్ వుడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్లు ఉన్నారు.