Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ వరుసగ ఓటముల తర్వాత టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌నే టార్గెట్ చేశానని అంటున్నాడు. ఈ మ్యాచ్‌లో తన ఫోకస్ అంతా అతనిపైనే ఉంచుతానని అన్నాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం మూడో టెస్టులో భాగంగా వర్చువల్ కాన్ఫిరెన్స్ ద్వారా స్మిత్ మీడియాతో మాట్లాడాడు.
మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాను. మూడో టెస్టు మ్యాచ్‌కు వచ్చేసరికి బ్యాటింగ్‍లో కొంత మార్పుతో ఆడుతున్నాను. తొలిరోజు ఆటలో చివరి సెషన్ వరకు నిలిచి లబుషేన్‌తో కలిసి కీలక పార్టనర్‌షిప్ నెలకొల్పడం సంతృప్తి ఇచ్చింది. ఈ సిరీస్‌లో అశ్విన్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను. కానీ అశ్విన్‌ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను.
ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డప్పటికీ పిచ్ పరిస్థితిపై అంచనాకు వచ్చిన తర్వాత బౌండరీలతో పరుగుల రాబట్టి సక్సెస్ అయ్యాననుకుంటున్నా. ఇదే తరహా ప్రదర్శన రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే 2 సెషన్లు కలుపుకొని మాదే పైచేయి అని వెల్లడించాడు.
వన్డే సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్ మొదటి టెస్టులు రెండింటిలో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపినా 10 పరుగులు మాత్రమే చేసి 2సార్లు అశ్విన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం విశేషం.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి సెషన్‌లో ఆసీస్ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.