Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి భారీ డిమాండ్.. ఏకంగా రూ.10 కోట్లు.. దక్కించుకునేందుకు ఆ టీమ్ రెడీ
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో అతడిపై రూ.10 కోట్లు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
stuart broad said in retention vaibhav suryavanshi may leave for mumbai indians
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు దక్కించుకున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. సూర్యవంశీ మీద అంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టడం చాలా సాహసమన్నారు. అయితే ఈ ఐపీఎల్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో సూర్యవంశీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ఆ నమ్మకాన్ని వైభవ్ నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌ల్లో 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43 స్కోర్లు సాధించాడు. మొత్తం 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. అతని సగటు 44.44 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 238.09 గా ఉండటం విశేషం. ఈ సీజన్లో 400 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడిగా సూర్యవంశీ నిలవడం గమనార్హం.
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ జుబిన్ భరూచా ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు. వేలంలో వైభవ్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు పక్కన పెట్టమని ఫ్రాంచైజీకి ముందే చెప్పారట. తొలి చూపులోనే వైభవ్ బ్యాటింగ్ శైలి తనను ముగ్ధుడిని చేసిందని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. ‘ప్లేయర్ రిటెన్షన్’ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యవంశీ ఆటతీరును ప్రశంసిస్తూనే.. భవిష్యత్తులో అతను ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్లకు వెళ్లే అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక “వైభవ్ లాంటి అసాధారణ ప్రతిభావంతుడిని 10 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద ఒకే టీమ్ అట్టిపెట్టుకోవడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది రిటెన్షన్ సమయంలో సూర్యవంశీ కనుక వేలంలోకి వెళ్లాలనుకుంటే.. ముంబై ఇండియన్స్ వంటి జట్లు.. అతడికి భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకునేందుకు ముందుకు వస్తాయి. తన విలువను గుర్తించిన సూర్యవంశీ కూడా ఫ్రాంచైజీల నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది” అన్నారు.
