Sunil Gavaskar : భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ విషయంలో అతడికి అంత లేదు
యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ఇంగ్లాండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Sunil Gavaskar blunt take on India new Test captain ahead of England tour
భారత టెస్టు క్రికెట్‌లో నవశకానికి పునాది పడింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను ఇంగ్లాండ్‌తో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మొత్తం 18 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా.. గిల్‌ను కెప్టెన్ చేయడం, ఇంగ్లాండ్ సిరీస్‌కు ప్రకటించిన జట్టు పై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. నాయకత్వంలో గిల్ కు పెద్దగా అనుభవం లేకపోయినా కూడా అతడిని కెప్టెన్ చేయడం అజిత్ అగార్కర్ తీసుకున్న ధైర్యమైన చర్య అని అభిప్రాయపడ్డాడు.
‘ఇంగ్లాండ్‌తో సిరీస్ నుంచే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కొత్త సైకిల్ (డబ్ల్యూటీసీ 2025-2027) ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సెలక్టర్లు గుర్తుంచుకుని జట్టును ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ జట్టులోని ఆటగాళ్లు మరో రెండు సంవత్సరాల పాటు ఆడాలని వారు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇక గిల్‌ను కెప్టెన్‌ను చేయడం సాహసోపేతమైన చర్య. ఎందుకంటే అతడికి కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేదు. అంతేకాకుండా జట్టులో అతడి కంటే అనుభవజ్ఞులైన జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కరణ్ నాయర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మొత్తంగా ఇది ఓ గొప్ప జట్టు.’ అని సునీల్ గవాస్కర్ తెలిపారు.
భారత కెప్టెన్‌గా ఎవరు ఎంపికైనా కూడా సహజంగానే అతడిపై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఆటగాడిగా ఉండటానికి, కెప్టెన్‌గా ఉండటానికి మధ్య పెద్ద తేడా ఉంటుందని గావస్కర్ చెప్పాడు. ‘జట్టు సభ్యుడిగా ఉన్నప్పుడు మీకు దగ్గరగా ఉన్న ఆటగాళ్లతో సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు మాత్రం జట్టులో ఇతర ఆటగాళ్లు మిమ్మల్ని గౌరవించే విధంగా ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన, అతడి ప్రదర్శన చాలా ముఖ్యం.’ అని గవాస్కర్ తెలిపారు.
ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ.. గిల్ మూడో స్థానంలోనే బరిలోకి దిగాలన్నాడు. ఆ తరువాత నాలుగో స్థానంలో కరుణ్ నాయర్, ఐదో స్థానంలో సాయి సుదర్శన్ రావాలని గావస్కర్ సూచించారు. ఇక గిల్ నాలుగో స్థానంలో రావడానికి ఎటువంటి కారణం లేదన్నాడు. అతడికి ఓపెనర్‌గా ఎంతో అనుభవం ఉంది. ఒకవేళ భారత జట్టు త్వరగా వికెట్ కోల్పోతే మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు అతడు సమర్థుడు అని గవాస్కర్ అన్నారు.
RCB : ఆర్‌సీబీకి లక్నో ‘టెన్షన్’.. కోహ్లీ ఆశ నెరవేరేనా?
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బ్యాటర్లు మొదటి రెండు మూడు మ్యాచ్‌ల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అందుకనే బౌలింగ్ యూనిట్ బాధ్యత తీసుకుని భారత్‌ను విజయ పథంలో తీసుకువెళ్లాలని గవాస్కర్ సూచించాడు.