RCB : ఆర్‌సీబీకి లక్నో ‘టెన్షన్’.. కోహ్లీ ఆశ నెరవేరేనా?
ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025లో ఇప్పటికే ప్లేఆఫ్స్ స్థానాలు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నప్పటికి.. లీగ్ దశ ముగిసే నాటికి టాప్-2లో నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. ఇక ఇదే సమయంలో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన జట్లు.. స్వేచ్ఛగా ఆడుతూ పై నాలుగు జట్లకు షాకులు ఇస్తున్నాయి.
గురువారం గుజరాత్ టైటాన్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ చెక్ పెడితే శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్‌రైజర్స్ షాక్ ఇచ్చింది. దీంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానం నుంచి మూడుకి పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.255 గా ఉంది.
Hit Wicket : కృనాల్ పాండ్యా కంటే ముందు ఎంత మంది ఆర్‌సీబీ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔట్ అయ్యారో తెలుసా?
ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 27 (మంగళవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్‌లో నిలిచేందుకు అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని సమీకరణాలు కలిసి రావాల్సి ఉంటుంది.
ఆర్‌సీబీ టాప్-2లో నిలవాలంటే..?
ప్రస్తుతం ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్ దశ ముగిసే నాటికి ఆర్‌సీబీ టాప్-2లో ఉండాలి అంటే ఇలా జరగాల్సి ఉంటుంది.
మొదటగా ఆర్‌సీబీ తన చివరి మ్యాచ్‌లో లక్నో పై విజయం సాధించాలి. ఇక అదే సమయంలో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై (మే 25న)తో ఓడిపోయినా లేదంటే.. రెండో స్థానంలో ఉన్న పంజాబ్ తన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు (మే24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 26న ముంబై)లో ఓడిపోయినా ఆర్‌సీబీ టాప్-2లో నిలుస్తుంది.
లక్నోతో అంత ఈజీ కాదు..
ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది లక్నో సూపర్ జెయింట్స్. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. ఈ సీజన్‌లో లక్నోకు ఆర్‌సీబీతో మ్యాచే చివరి కానుంది. ఈ క్రమంలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ముగించాలని లక్నో జట్టు భావిస్తోంది. అదే సమయంలో ఆర్‌సీబీ పై టాప్-2లో నిలవాలనే ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలో లక్నో మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవాలంటే కష్టపడాల్సిందే.