Sunil Gavaskar : ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఇలాంటివి అవసరమా..
ఐసీసీ పై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) మండిపడ్డాడు.
Sunil Gavaskar Brutally Slam T20 World Cup 2026 Arrangement
- కోల్‌కతా వేదికగా తలపడిన భారత్ వర్సెస్ వెస్టిండీస్
- మ్యాచ్ మధ్యలో లేజర్ షో
- తప్పుబట్టిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి
Sunil Gavaskar : ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్ షోను నిర్వహించారు. దీనిపై భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లు మండిపడ్డారు. మ్యాచ్ సమయంలో ఇలాంటి వాటి అవసరం ఏముందని ప్రశ్నించారు. వీటి వల్ల బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతింటుదని ఆందోళన వ్యక్తం చేశారు.
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. పవర్ ప్లే పూర్తి అయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఈ సమయంలో డ్రింక్స్ విరామాన్ని తీసుకున్నారు. మూడు నిమిషాల ఈ విరామ సమయంలో స్టేడియంలో లైట్ల కాంతి ఒక్కసారిగా తగ్గిపోయింది. మైదానం మొత్తం కాసేపు చీకటి అలుముకుంది. ఆ సమయంలో లేజర్ షో నిర్వహించారు.
‘డ్రింక్స్ బ్రేక్ సమయంలో రెండున్నర లేదా మూడు నిమిషాల పాటు లేజర్ షో నిర్వహించిన తరువాత బ్యాటర్లు లేదా ఎవరికైనా సరే అంతక సులభం కాదు. మీ కళ్ళు వెలుగుకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. ప్రపంచకప్ వంటి టోర్నమెంట్లలో ఇలాంటివి అవసరం లేదు. ఐపీఎల్ వంటి లీగుల్లలో అయితే ఇలాంటి ఒకే కానీ.. ఐసీసీ ఈవెంట్లలో ఇలాంటి వినోదం అవసరం లేదు.’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇక గవాస్కర్ వ్యాఖ్యలను రవిశాస్త్రి కూడా సమర్థించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ (40), జేసన్ హోల్డర్ (37 నాటౌట్)లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత సంజూ శాంసన్ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ లు చెరో రెండు వికెట్లు సాధించగా.. అకేల్ హోసిన్ ఓ వికెట్ పడగొట్టాడు.
