Sunrisers Hyderabad: బాబోయ్ మేం హైదరాబాద్‌లో ఉండలేం.. వదిలి వెళ్లిపోతాం.. సన్‌రైజర్స్ ఆవేదన.. వెలుగులోకి సంచలన లేఖ
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న వేళ హెచ్‌సీఏ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.

Courtesy BCCI
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025 లో భాగంగా ఎస్ఆర్ హెచ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. విశాఖపట్టణం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ రాసిన లేఖ బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందంటూ.. హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోతామని హెచ్చరించారు.
ఉచిత టికెట్లకోసం..
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న వేళ హెచ్‌సీఏ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఐపీఎల్ ఉచిత టికెట్ల కోసం హెచ్‌సీఏ నుంచి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఎక్కువవుతుందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్ లేఖ రాసింది. ఈ లేఖలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని పాస్ లు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒప్పందం ప్రకారం..
సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖ ప్రకారం.. పన్నెండేళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాం. కానీ, గత రెండు సీజన్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో హెచ్‌సీఏకు 10శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ, గత మ్యాచ్ సందర్భంగా ఎఫ్-3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
సమావేశం ఏర్పాటు చేయండి..
ఈ ఏడాది హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు పలుసార్లు బెదిరించారు. దీన్ని సంఘం దృష్టికి తీసుకొచ్చాం కూడా. వారి ప్రవర్తన బట్టిచూస్తే ఈ స్టేడియంలో సన్ రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్లుగా అనిపిస్తోంది. అదే ఉద్దేశమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతాం. దీనిపై చర్చించేందుకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు.