12ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతోనే ప్లేఆఫ్ రేసులో నిలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది ఫైనల్ ప్రత్యర్థిగా పోరాడిన రైజర్స్ ప్రస్తుత సీజన్లో కష్టమేననుకుంటున్న తరుణంలో ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి బాగా కలిసొచ్చింది. వాస్తవానికి హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ (+0.028), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (-0.251) జట్ల ఖాతాలో కూడా 12 పాయింట్లే ఉన్నాయి.
కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇక్కడ కలిసొచ్చిన అంశం నెట్ రన్‌రేట్. వాటికంటే అధికంగా (+0.577)ఉండటంతో ప్లేఆఫ్‌కు చాన్స్ కొట్టేసింది. 2016 టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్.. ఈ సీజన్‌లో ఏ మేరకు పోటీనివ్వగలదో చూడాలి. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరమైన వేళ స్వల్ప విరామానికే వికెట్లు చేజార్చుకుంటూ భారీ టార్గెట్‌ల ముందు తేలిపోతుంది. పైగా గత సీజన్లో బౌలింగ్ ప్రధాన ఆయుధంగా సాగిన జట్టుకు ఈ సారి కలిసిరావడం లేదు.
రషీద్ ఖాన్ ఆల్ రౌండర్ ప్రదర్శన మచ్చుక అయినా కనిపించడం లేదు. సీజన్ మొత్తానికి ఆడింది 14 మ్యాచ్ లు అయితే అందులే కేవలం 34పరుగులు చేసి 15 వికెట్లు తీయగలిగాడు. 2018 సీజన్లో మాత్రం ఆడిన
17 మ్యాచ్‌లలో 59 పరుగులు చేసి 21వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి పరుగుల విషయంలో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోల మీదే ఆధారపడి గెంటుకొచ్చేస్తుంది రైజర్స్.
కెప్టెన్సీ బాధలు తప్పలేదు. కొన్ని మ్యాచ్‌లకు విలియమ్సన్ అనారోగ్యం కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో బాధ్యతలు చేపట్టిన భువీ నడిపించిన తీరే జట్టును ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ఈ ఏడాది బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తోంది ఖలీల్ అహ్మద్ అనే చెప్పాలి. 8మ్యాచ్‌లలో సున్నా పరుగులిచ్చి 17వికెట్లు తీశాడు.
మే8న జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భవితవ్యం తేలిపోతుంది. ఒకవేళ గెలిచేసిందంటే.. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో మళ్లీ తలపడాల్సి ఉంటుంది. మనోళ్లు సత్తాచాటి ప్రత్యర్థులను క్వాలిఫైయర్-2లోనూ చిత్తు చేయగలిగితే ఇక ఫైనల్ సమరానికి సిద్ధమవ్వాల్సిందే.