IND vs PAK : భారత్‌తో మ్యాచ్ ఆడండి..! శ్రీలంక అభ్యర్థనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
IND vs PAK : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంటుంది. : శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంటుంది.
IND vs PAK
IND vs PAK : ఇండియా, శ్రీలంక వేదికగా ఐసీసీ టీ20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీ నేటి నుంచి ప్రారంభమైంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మద్దతుగా టీమిండియాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈనెల 15న కొలంబో వేదికగా జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తుండగా.. తాజాగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పీసీబీకి అనుమతిచ్చింది. అయితే, ఈ టోర్నీలో లీగ్ దశలో భారత్ జట్టుతో జరిగే మ్యాచ్‌ను మాత్ర బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సూచించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పీసీబీ భారత్ తో మ్యాచ్ ను ఆడేది లేదని చెప్పేసింది. అయితే, భారత్ వర్సెస్ పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ జరగకుంటే ఐసీసీ, బ్రాడ్ కాస్టర్స్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదేసమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా నష్టమే.
ఈ నేపథ్యంలో భారత్ తో జరిగే మ్యాచ్ లో ఆడాలని కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక లేఖ రాసింది. ఆ లేఖపై స్పందించిన పీసీబీ తమ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈనెల 15న పాక్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ యథావిధిగా జరిగే అవకాశం ఉంటుంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా స్వయంగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని సంప్రదించారు. ఈ సమయంలో శ్రీలంకకు పాకిస్థాన్ మద్దతు అవసరమని, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లు లేకపోతే శ్రీలంక బోర్డు ఆదాయాన్ని కోల్పోతుందని ఆయన తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పీసీబీ చైర్మన్ నఖ్వీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం నాటికి పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం.
